15-10-2025 08:00:30 PM
కాటారం,(విజయక్రాంతి): రెవెన్యూ శాఖలో విలీనం కాబడిన 43 మంది జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులకు శిక్షణ కాలాన్ని నిర్ణయించి, వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు మార్క రామ్మోహన్ గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్లుగా, మరికొంతమందిని లష్కరులుగా నియమించారని, రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు వారికి ఎలాంటి ప్రొబేషన్ పీరియడ్ ను డిక్లేర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సీసీఎల్ఏ అధికారుల నుంచి మార్గనిర్దేశకాలను తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచనల ప్రకారం జిల్లా కలెక్టర్ ప్రొబేషన్ పీరియడ్ ను గుర్తించడానికి అవకాశం ఉందని రామ్మోహన్ తెలిపారు. ఇప్పటికైనా జిల్లాలో వివిధ మండలాలలో పనిచేస్తున్న 43 మంది రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని మార్క రామ్మోహన్ గౌడ్ కోరారు.