13-11-2025 12:53:46 AM
కొల్చారంలో రైస్ మిల్లులు తనిఖీ
కొల్చారం, నవంబర్ 12 :వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యేవిధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కొల్చారం మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా సత్యసాయి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు వంటి అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీలో ధాన్యం సేకరణ, నిల్వ ప్రక్రియలపై ఆయన ఆరా తీశారు.
ఏ లారీ కూడా 24 గంటలకు మించి వెయిటింగ్ లో ఉండకూడదని అందుకు తగ్గట్టుగా రైస్ మిల్లర్లు హమాలీలని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు నిర్వహణ తీరును తెలుసుకున్నారు. జిల్లాలో 82 వేల 481 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, 21,277 మంది రైతులకు గాను 54 కోట్ల 52 లక్షల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రైతులకు నాణ్యమైన ధాన్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, డిప్యూటీ తహసిల్దార్ నాగవర్ధన్, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.