ఉవ్వెత్తున ఎగిసింది..!
- స్టాక్ మార్కెట్‌లో ఎగ్జిట్ ఫలితాల జోష్
భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలో పెరుగుదల
రూ.14.2 లక్షల కోట్ల మేర పెరిగిన మదుపరుల సంపద
భారీ స్థాయిలో పెరిగిన గౌతమ్ ఆదానీ ఆస్తులు
ముంబై, జూన్ 3: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. సోమవారం ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న అంచనాల నడుమ ముంబై మార్కెట్‌లో బుల్ రంకెలేసింది. జీడీపీ వృద్ధి రేటు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, తొందరగా నైరుతి రుతుపవనాలు రావడం, భారీ జీఎస్టీ వసూళ్లు కూడా అందడంతో మార్కెట్లకు మరింత జోష్ వచ్చింది.
దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు ముగిసే సమయానికి దూకుడు కనిపించింది. సూచీల లాభాలు పరుగందుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 76,400 మార్కును అందుకోగా, నిఫ్టీ సైతం 23,200కు ఎగిసిపడింది. బీఎస్‌ఈలో మదుపరులకు భారీ లాభాలను ఆర్జించి పెట్టింది. ఏకంగా వారి సంపద రూ.14.2 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల సంపద రూ.426.31 లక్షల కోట్ల నుంచి రూ.412.12 లక్షల కోట్లకు ఎగబాకింది. గత మూడేళ్లలో ఒకే రోజు ఇంతగా లాభాలు ఒకే రోజు రావడం ఇదే ప్రథమం.
ఆది నుంచీ పరుగో పరుగు..
సెన్సెక్స్ ఉదయం 76,583.29 పాయిం ట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. మొదట్లోనే దాదాపు 2,507.47 పాయింట్ల లాభంతో (3.39 శాతం) ప్రారంభం కావడంతో అందరూ కాస్త అనుమానంగా చూశారు. కానీ చివరి వరకు కూడా సెన్సెక్స్ దూకుడు సాగించింది. ఇంట్రాడేలో 76,486.78 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 733.20 పాయింట్ల లాభంతో (3.25 శాతం) 24,263.90 వద్ద స్థిరపడింది.
లాభపడ్డ కంపెనీలు ఇవే..
సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు మినహా దాదాపు అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర రూ.80.71 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ఔన్సు ధర 2,349 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అంబానీని మించిన గౌతమ్ అదానీ
స్టాక్ మార్కెట్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని భారత్‌లో అత్యంత సంపన్నుడిని చేసింది. ప్రస్తుత ర్యాలీలో అదానీ నికర ఆస్తుల విలువ రూ.9.24 లక్షల కోట్ల (11,100 కోట్ల డాలర్లు)కు చేరింది. దీంతో గౌతమ్ అదానీ మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.






