13-12-2025 12:42:34 AM
కలుషిత నీటితో రోగాలు.. కనీస సౌకర్యాలు కరువు
శామీర్ పేటలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన విద్యార్థులు
మెనూ ప్రకారం విద్యార్థులకు అందని భోజనం
మేడ్చల్, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): గురుకుల పాఠశాలలు సమస్యల నిలయాలుగా తయారయ్యాయి. విద్యార్థులకు సరైన భోజనం అందకపోవడమే గాక కనీస సదుపాయాలు కూడా కరువయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం నోరూరించే మెనూ ప్రకటించింది. కానీ ఇది ఎక్కడ అమలు కావడం లేదు. రాళ్లు, పురుగుల అన్నం పెడుతున్నారని, ప్రశ్నిస్తే టీచర్లు కొడుతున్నారని విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది.
మేడ్చల్ జిల్లా షామీర్పేట్ లో ని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. షామీర్పేట్, కుతుబుల్లాపూర్, హైదరాబాదుకు చెందిన జ్యోతిబాపూలే గురుకులాలు ఒకే ప్రాంగణంలో నడుస్తున్నాయి. ఫిర్యాదు చేసిన తర్వాత పాఠశాలలో ఆందోళన చేశారు. గతంలో శామీర్పేట మండలంలో ని తురకపల్లిలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థుల సైతం ఆందోళన చేశారు. సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు.
కలెక్టర్ తనిఖీ చేసినా..
కలెక్టర్ మను చౌదరి షామీర్పేటలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను ఆగస్టు ఒకటవ తేదీన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కనీస వసతులను పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ తనిఖీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.
తనిఖీలు తగ్గడంతో సిబ్బంది ఇష్టారాజ్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని జూలైలో ఆదేశించారు. సీఎంఓ లోని అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎప్పటికప్పుడు జిల్లాల నుంచి సమాచారం వెళ్ళేది. మేడ్చల్ జిల్లాకు సర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ స్పెషల్ అధికారిగా నియమించారు.
కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఇతర ముఖ్య అధికారులు తనిఖీలు చేయడంతో గురుకుల పాఠశాలలు, ఆస్పత్రులు గాడిన పడ్డాయి. ప్రస్తుతం తనిఖీలు తగ్గడంతో పరిస్థితి ఎప్పటి మాదిరే ఉంది ప్రభుత్వం స్పందించి గురుకుల పాఠశాలలో వసతులు మెరుగు పరచాలని, నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.