calender_icon.png 19 February, 2026 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దానంపై స్పీకర్ తీర్పు రిజర్వు

19-02-2026 12:56:30 AM

నేడు ఎమ్మెల్యే కడియం విచారణ

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవా రం విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఎమ్మెల్యే దానం నాగేందర్ తరపున  న్యాయవాదులు హాజరయ్యారు. దానంపై అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిలు కూడా హాజరయ్యారు.

దానం నాగేందర్ పార్టీ మారినట్లుగా ఆధారాలు ఉన్నాయా..? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని దానం నాగేందర్ తరపున న్యాయవాదులు ప్రశ్నించినట్లు తెలిసింది. దానం నాగేందర్ పార్టీ మారినట్లుగా ఆధారాలున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని, అందుకు కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో కూడా దానం పేరు ఉందని స్పీకర్‌కు అందజేశారు.

అంతేకాకుండా పలుమార్లు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు కూడా హాజరయ్యారని కౌశిక్‌రెడ్డి ఆధారాలు చూచించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కూడా.. బీఆర్‌ఎస్‌లో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లుగా స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. దానం నాగేందర్ తరపున అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్, పిటిషన్ వేసిన ఎమ్మెల్యేల వాదనలను స్పీకర్ విన్న స్పీకర్.. తీర్పు వెలువరించలేదు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే 8 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అనర్హత పిటిషన్లను కొట్టి వేసిన విషయం తెలిసిందే.  ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా జరుగుతోంది. గురువారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఉన్న అనర్హత పిటిషన్‌పై విచారణ జరగనుంది. 

ఖైతరాబాద్‌కు ఉప ఎన్నిక తప్పదు: ఎమ్మెల్యే పాడి 

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడుతుందని, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికల తప్పదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌కు సంబంధించి స్పీకర్ ముందు విచారణకు హాజరైనన అనంతరం కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పార్టీ మారినట్లుగా ఆధారాలున్నాయని, స్పీకర్ రాజ్యాంగాన్ని కాడాలంటే దానంపై అనర్హత వేటు వేయాలన్నారు.

తనను ఉదయం 11 గంటలకు హాజరుకావాలని చెప్పి.. మధ్యాహ్నం 12 గంటలకు లోపలికి పిలిచారని, ఐదారు గంటలు క్రాస్ ఎగ్జ్గామినేషన్ చేశారని, అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని ఆయన తెలిపారు. దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని, ఏఐసీసీ ప్రకటించిన జాబితాలోనే దానం పేరు ఉందన్నారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని, తెలంగాణలో మాత్రం రాజ్యాంగానికి విరుద్దంగా పాలన జరుగుతోందని ఆయన విమర్శిచారు.

పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్‌రెడ్డినే చెప్పారని కౌశిక్‌రెడ్డి గుర్తుచేశారు. అసెంబ్లీలోకి మీడియాను కూడా అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనేది క్లియర్‌గా కనిపిస్తోందన్నారు. బడా భాయ్, చోటా భాయ్ లాగా కాంగ్రెస్, బీజేపీ తీరు ఉందన్నారు. 

డ్రామా ఆడుతున్నారు: మహేశ్వర్‌రెడ్డి 

దానం నాగేందర్ కేసును సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకునేందుకు అన్ని ఆధారాలున్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. దానం నాగేందర్ అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్‌ను సస్పెండ్ చేసినట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలుసా..? అని అడ్వకేట్స్ అడిగారని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

అయితే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన విషయాన్ని బీఆర్‌ఎస్ ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారని నిలదీశారు. దానం నాగేందర్‌ను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే.. అనర్హత పిటిషన్ కేసు నిలబడదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాన్ని ఎందుకు సాగదీస్తుందని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ కూడా అనర్హత వేటు అంశాన్ని ఏడాదిన్నర కాలాంగా సాగదీయడం సరికాదన్నారు.