calender_icon.png 19 February, 2026 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్ష రాసే అవకాశమివ్వండి

19-02-2026 12:49:21 AM

  1.   300 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయాలి
  2. ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ
  3. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఛాంబర్ వద్ద ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ నిరసన

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల 300 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విద్యార్థులకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని, వారికి వెంటనే హాల్ టికెట్స్ జారీ చేయాలని డిమాండ్ చేసింది. ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల జీవితాలను అంధాకారంలో నెడుతున్నారని ఏబీ వీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవా రం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏబీవీపీ ముట్టడించగా, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియే షన్ నేతలు బోర్డు కార్యదర్శి ఛాంబర్‌లో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యాకర్తలు బోర్డు కార్యాలయం గేటు దూకి లోపలి కి వెళ్లే ప్రయత్నం చేయగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు మీద బైఠాయించి వారు నిర సన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ... తెలం గాణ రాష్ర్టంలోని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అనుమతుల్లేని కళాశాలలు నడుస్తున్నా వాటిపై చర్యలు తీసుకోవట్లేదని, ఒకే పేరుతో పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు నడుపుతూ, ఒక కళాశాలలో అడ్మిషన్ తీసుకొని వేరొక కళాశాలలో తరగతులు నిర్వహిస్తుంటే బోర్డు అధికారుల కళ్లు మూసుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేసిన కళాశాలలపై చర్యలేవి? 

విద్యార్థులు పరీక్షల ఫీజులు కళాశాలల్లో చెల్లించినప్పటికీ, ఆ విద్యార్థుల పేర్లు బోర్డు వద్ద నమోదు చేపించకుండా కళాశాలలు నిర్లక్ష్యం చేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకోకుండా వారికే వత్తాసు పలుకు తూ... విద్యార్థులు తమకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరితే ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆది త్య కర్కశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తొమ్మిది మంది విద్యార్థులు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారని, మరీ డబ్బులు లేని పేద విద్యార్థుల సంగతేంటని నిలదీశారు.

ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు బోర్డు సెక్రట రీ తొత్తుగా మారారని, వారి వద్ద నుంచి ఎన్ని కమిషన్లు నొక్కుతున్నారో అర్థం కావడం లేదన్నారు.  నిర్లక్ష్యంగా వ్యవహరించే బోర్డు సెక్రటరీనీ వెంటనే తొలగించి, ఆ 300 మంది విద్యార్థులకు పరీక్షలురాసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పరీక్ష రాసే అవకా శం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కార్యక్రమం లో మహానగర కార్యదర్శి పృథ్వీ తేజ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజు, విభాగ్ కన్వీనర్లు హరిప్రసాద్, నగేష్, జిల్లా కన్వీనర్లు భరత్, తేజా సాగర్, అఖిల్, వినయ్, మృత్యుంజయ, విక్రమాదిత్య, బాలకష్ణ, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్లు పూజిత్, అక్షిత, దివ్యలత పాల్గొన్నారు. 

సాంకేతిక కారణాలతో తప్పిదాలు.. 

సాంకేతిక కారణాలతోనే ఫీజులు చెల్లించలేకపోయినట్లు కాలేజీల యాజమాన్యాలు చెబు తున్నాయి. చిన్న చిన్న ఎర్రర్స్, సర్వర్ బిజీ, కాలేజీలకు ఆబ్సెంట్ అయ్యే విద్యార్థులు చివరి నిమిషంలో రావడం, సర్‌నేమ్‌లో తప్పులు దొర్లడం వంటి కారణాలను కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి.

అనుకోని కారణాలతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదివి, సెకండ్ ఇయర్ మరో కాలేజీలో చేరిన విద్యార్థులకు హల్‌టికెట్లు  ఇవ్వడంలేదు. ఇందులో పలు కాలేజీల పొరపాట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫీజులు కాలేజీ యాజమాన్యాలు కట్టాయని విద్యార్థులు పట్టించుకోకపోవడం, కొంతమంది అడ్మిషన్ తీసుకొని మళ్లీ పరీక్షలప్పుడు రావడం, కాలేజీ ఫీజు కడితేనే పరీక్ష ఫీజు కడతామని పలు కాలేజీలు కండీషన్లు పెట్టడంలాంటి కారణాలున్నాయి. 

తామేమీ చేయలేమంటున్న ఇంటర్ బోర్డు

పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇప్పటికే పలుమార్లు తేదీలను ప్రకటించామని కాలేజీ యాజమాన్యాలతో ఇంటర్ బోర్డు చెబుతోంది. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ అయిపోయాయి. ఇప్పుడేమీ చేయలేమని అంటున్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. 

సీఎం, డిప్యూటీ సీఎం చెప్తున్నా వినట్లేదు..

పరీక్షా ఫీజు చెల్లింపునకు అవకాశమివ్వకుం డా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మొం డిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నాయకులు గౌరీ సతీష్ పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించకుండా వారి జీవితాలతో చెలగాటమాడు తున్నారని విమర్శించారు. మంత్రులు చెప్తున్నా వారి ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయడంలేదని తెలిపారు.

రాష్ట్రంలోని దాదాపు 920 వరకు పరీక్ష కేంద్రాల ప్రతి నిధులు సెక్రటరీ ఛాంబర్‌లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేస్తుంటే పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు చెప్తున్నా బోర్డు కార్యాదర్శి కృష్ణ ఆదిత్య వినడంలేదని ఆరోపించారు. గతంలో ఫీజు చెల్లిం చుకున్నారని కానీ ఈసారి ఇలా చేయడం సరికాదన్నారు. ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులు భవిష్యత్‌ను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.