13 June, 2026 | 2:14 AM

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లదాడి

13-06-2026 12:00 AM
  1. ఇద్దరు మైనర్‌ల అరెస్ట్.. పరారీలో మరొకరు 
  2. మోహన్ భగవత్ క్షేమమేనన్న పోలీసులు
  3. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఘటన

లక్నో, జూన్ 12 (విజయక్రాంతి): ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణి స్తున్న రైలుపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. పోలీసులు దాడికి సంబం ధించి ఇద్దరు నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకోగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. గురువారం రాత్రి మోహన్ భాగవత్ కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళుతున్న 12003 గోల్డెన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు రైలుపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఏసీ ఫస్ట్‌క్లాస్ కోచ్‌లోని ఓ కిటికీ పగిలిపోయింది. భాగవత్ కూడా ఇదే కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోహన్ భాగవత్ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. రైల్వేశాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆగ్రా జోన్ అదనపు డీజీపీ, ఆగ్రా రేంజ్ డీఐజీ, ఎస్‌ఎస్పీ ఆదిత్య లాంగేల ఆదేశాల మేరకు, రసూల్‌పూర్, సౌత్, లైన్‌పార్ పోలీస్ స్టేషన్లు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, నిఘా విభాగం నుంచి 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు ఆ ప్రాంతంలోని 50కి పైగా సీసీకెమెరాల ఫుటేజీని జల్లెడపట్టాయి.

సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు మైనర్ పిల్లలు రైలు పట్టాలపై చెత్త ఏరుతున్నట్లు కనుగొన్నారు. వీరే రైలుపై రాళ్లు విసిరి, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగించారని పోలీసులు నిర్ధారించారు. అందులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై సెక్షన్ 152 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని డీఐజీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నామని పేర్కొన్నారు.