24 March, 2026 | 7:30 AM

రిజిస్ట్రేషన్ల ఆదాయంపై అసత్యాలొద్దు!

24-03-2026 01:31 AM
  1. హరీశ్‌రావు ఆరోపణలు అవాస్తవం
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిందని బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే హరీశ్‌రావు అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.

అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘2024- ఆర్థిక సంవత్సరానికి గాను ఆ శాఖకు రూ.14,250 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆదాయం నుంచి మున్సిపాలిటీలు, కా ర్పొరేషన్లకు వాటాగా రావాల్సిన రూ. 5,740 కోట్లను ప్రభుత్వం సర్దుబాటు  చేసిందని వివిరంచారు.

‘ గత ప్రభుత్వం 2020 నుంచి స్టాంపులు,  రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీ చేయకుండా కాలయాపన చేసింది. ఆ నిధులను మొత్తంగా స్టాంప్ డ్యూటీ ఆదాయంగానే చూపించి తప్పుడు లెక్కలు చెప్పింది. గత ప్రభుత్వం చేసిన తప్పును మళ్ళీ పునరావృతం చేయకూడదని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయరాదనే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ఆదాయం నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులను కేటాయించింది ’ అని తెలిపారు. 

అసెంబ్లీని టీ బ్రేక్ పేరుతో రెండున్నర గంటల పాటు వాయిదా వేశామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన విమర్శల్లో అర్థం లేదని భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ‘ సభ వాయిదా పడినప్పటికీ మేము అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండి విధులను నిర్వర్తించాము అని చెప్పారు.

‘విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల కోసం ఈ బడ్జెట్‌లో రూ.1.20 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఎస్పీడీసీఎల్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అసిస్టెంట్ లైన్మెన్ ఓర్సు సురేష్, మహబూ బ్‌నగర్‌కు చెందిన ముక్తార్ బేగ్ కుటుంబాలకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కులను అసెంబ్లీ హాల్లోనే పంపిణీ చేశాం’ అని చెప్పారు.