10-11-2025 12:00:00 AM
* ఛాంబర్ ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు
* ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు
* ప్రతిరోజు మందు విందుల కోసం భారీగా ఖర్చు
* ఓ వర్గం దిగజారుడుతనంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఖమ్మం, నవంబరు 6 (విజయ క్రాంతి): ‘ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఖమ్మం పట్టణ వ్యాపార వర్గాలకు సంబంధించిన ఓ సంఘం. దీని పరిధిలో 18 వ్యాపార వర్గాలు, వీటికి సంబంధించిన సభ్యులు 1305. మూడేళ్లకు ఓ సారి ఈ సంఘానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ లెక్కన వీటికి సంబంధించిన ఎన్నికల తంతు నామమాత్రమే అనుకో వాలి. కానీ, దీనికోసం పోటీ పడబోయే ఆయా వర్గాల హడావిడి మినీ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి.
గెలుపు కోసం ఆయా వర్గాలు పోటీ పడుతూ, తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇందులో ఓ వర్గం మాత్రం గెలుపే ధ్యేయం గా వింత పోకడలు పోతోంది. ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ‘మందు, విందు’ అంటూ అడ్డదారులు తొక్కుతోంది. ఇందుకోసం చీకటి పడగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసి భారీగానే ఖర్చు పెడుతోంది. సదరు వర్గం వ్యవహారాన్ని చూస్తున్న కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘చిన్నపాటి పదవుల కోసం ఈ స్థాయిలో దిగజారాలా?’ అనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన పానెల్ కే తీవ్ర పోటీ..
మూడేళ్లకు ఓసారి జరిగే ఎన్నికల్లో ప్రధాన పానెల్ కు సంబంధించిన ఎన్నికే ముఖ్యమైనది. ఆ తరువాత దిగుమతి శాఖ కు ప్రాముఖ్యం ఉంటుంది. మిగతా శాఖలకు సంబంధించిన ఎన్నిక నామ మాత్రమే! ప్రధాన పానెల్ కు ఎన్నికల కోసం రెండు వర్గాలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఈ ప్యానెల్ లోనే అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ, ట్రెజరర్ల పదవులు ఉండటం, వీటికి ఎన్నికైన వారి చేతిలోనే ఛాంబర్ అధికారాలు ఉండటమే కాకుండా ఆయా శాఖల్లో, ముఖ్యంగా గ్రెయిన్ మార్కెట్లో పలుకుబడి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ప్రధాన పానెల్ ను ఎలాగైనా దక్కించుకోవాలని ఈ రెండు వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సంఘం ఓటర్లను కలిసి తమకే ఓటు వేయాలని వేడుకోవడంతోపా టు, ప్రచార చిత్రాలను, బ్యానర్లను ప్రధాన మార్కెట్ కూడళ్లలో ఏర్పాటు చేసి గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. వీరి ప్రచారంతో త్రీ టౌన్ లోని గాంధీ చౌక్, గ్రెయిన్ మార్కెట్ ప్రాంతమంతా హడావుడిగా కనిపిస్తోంది.
నామినేషన్లు ముగిసిన తర్వాత నుంచి..
ప్రధాన పానెల్ కు పోటీ పడుతున్న ఓ వర్గం ఛాంబర్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కసితో అడ్డదారుల్లో వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నామినేషన్ వేసిన రెండో రోజు నుంచే ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఎత్తులు వేసింది. మందు పార్టీలు ఏర్పాటు చేసి విందులు చేసింది. ఈ విష యం బయటకు పొక్కడంతో తమ ప్యానెల్ కు చెడ్డ పేరు వస్తోందని, దీనివల్ల తమ ఓటు బ్యాంకు కి చిల్లు పడే అవకాశం ఉందని భావించి వేరే మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముందు పార్టీ అని కాకుండా జన్మదిన వేడుకల ముసుగులో మద్యం పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
ఇందుకోసం ఛాంబర్ ఓటర్లలో ఎవరిదైనా పుట్టినరోజు ఉందేమోనని ఆరా తీసి, వారి పేరిట సాయంత్రం మందు పార్టీకి సదరు వర్గం సన్నాహాలు చేస్తోంది. ఆ రోజు జన్మదినం జరుపుకునే వారిని తాము నిర్ణయిం చిన చోటుకి సాయంత్రం పిలిపించి, వారితో కేకు కోయించి సంబరాలు చేస్తున్నారు. ఆ తర్వాత సంబరాలకు వచ్చిన వారిని మందు, విందుల్లో ముంచి తేల్చుతున్నారు. ఈ మందు పార్టీకి ఓటర్లలో ఎవరిని ఆహ్వానించాలో ఉదయమే నిర్ణయించి, వారికి రహ స్యంగా సమాచారం అందించడమే కాకుం డా, వారంతా తామిచ్చే పార్టీకి కచ్చితంగా హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రతిరోజు రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచా రం. దీనికి సంబంధించిన ఖర్చును సదరు వర్గం తరఫున పోటీపడే వారు వాటాలు వేసుకొని భరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకిలా..?
ఛాంబర్ ఎన్నికలకు పోటీ పడుతున్న వారంతా వ్యాపారులే! వీరంతా తమ పెట్టుబడి మీద 10% నష్టాన్ని కూడా భరిం చడానికి ఒప్పుకోరు. లాభం లేనిదే రూపా యి కూడా ఖర్చు చేయరు. అలాంటిది సదరు వర్గం పార్టీల పేరిట ఎన్నికల నాటికి (నవంబర్ 16) చేసే ఖర్చు దాదాపు రూ.20 నుంచి రూ.25 లక్షల మేర వస్తుందని అంచనా! కేవలం ఛాంబర్ పదవుల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేస్తుండటంపై పలు సం దేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో గెలి చి పదవులు దక్కితే, ఆ తర్వాత ఛాంబర్ కు వచ్చే ఆదాయం నుంచి తాము పెట్టిన ఖ ర్చును ఎలాగో ఒకలాగా రాబట్టుకోవచ్చనే భావనలో సదరు వర్గం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఛాంబర్ ను తన గుప్పెట్లో పెట్టుకొని తమ వ్యాపారాలను ఇష్టరీతిన నిర్వహించుకునేందుకే ఈ వ్యవహారమంతా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు వర్గం చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పోటీలో అక్రమార్కులు..!
ఈ ప్యానెల్ నుంచి ప్రధాన పదవులకు పోటీ పడబోతున్న వారి పైన మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఈ ప్యానెల్ లోని ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డాడు అనే విమర్శలు ఉన్నాయి. ఇక దీనికి తోడు ఇతరత్రా వర్గాల్లో కాస్త మేనేజ్ చేయగలిగిన వ్యక్తులను చేరదీసి, తన వెంచర్లలో చీకటి వ్యవహారాలు చేయిస్తాడనే ప్రచారం ఉంది. సదరు వ్యక్తి గురించి తెలిసిన కొంతమంది వ్యాపారులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండడం గమనార్హం! ఇక పానెల్ మరో ప్రధాన సీటుకి పోటీ పడబోతున్న ఓ పెద్ద ఖరీదుదారు కమీషన్ వ్యాపారులను పీల్చి పిప్పి చేస్తాడనే ప్రచారం ఉంది. కటింగ్ బిల్లుల వ్యవహారంలో ఊరంతా ఓ పోకడైతే, సదరు వ్యాపారిది మరో దారి. కటింగ్ బిల్లుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాడన్న ప్రచా రం ఉంది. సదరు పెద్ద వ్యాపారి కటింగ్ బిల్లు రేటుని తగ్గిస్తే, మిగతా వ్యాపారులు కూడా తగ్గిస్తారు. దీని వల్ల కమీషన్ వ్యాపారులకు కాస్త ఊరట కలుగుతుంది. కానీ ఈ పెద్ద వ్యాపారి కటింగ్ బిల్లు వ్యవహారంలో కాస్త కూడా పట్టు విడుపు ప్రదర్శించడని సమాచారం.
ఇలా అక్రమ వ్యవహారాల్లో పాలు పంచుకునే వ్యక్తి, వ్యాపారుల గురించి కనీసం ప ట్టించుకోని వ్యక్తులు ఛాంబర్ పదవులకు ఎ లా పోటీ చేస్తారని, ఒకవేళ గెలిచినా వ్యాపార వర్గాలకు ఎలా న్యాయం చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.