20 July, 2026 | 9:54 PM

సాగునీటి సంస్థల బలోపేతం

20-07-2026 02:24 AM
  1. రుణభారం తగ్గింపునకు కొత్త ప్రణాళికలు 
  2. తక్కువ వడ్డీకే నిధుల సేకరణ
  3. పది రోజుల్లో కార్యాచరణ  సిద్ధం  చేయాలి 
  4. అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి సాధించేలా కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. రుణభారం తగ్గించి, తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణా లు సమీకరించేలా పది రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్ వ్యవస్థీకరణపై ఆదివారం హైదరాబాద్ కుందన్ బాగ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌పై ఆధారపడకుండా ఆర్థిక ఒత్తిళ్లను తగ్గిస్తూ సాగునీటి సంస్థలకు స్థిరమైన నిధుల సమీకరణ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో భాగంగా సాగునీటి సంస్థలకు చెందిన ఖాళీ భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం, లీజుకు ఇచ్చి ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలన్నారు.

నిజాంసాగర్‌తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల సాధ్యతను అధ్యయనం చేయాలని సూచించారు. రైతులపై ఎటువంటి భారం పడకుండా ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాతే అమలు చేయాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న చట్టబద్ద ఆడిట్లను వెంటనే పూర్తి చేయాలని, ఆడిటర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి పునర్ వ్యవస్థీకరిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం 11 శాతం వడ్డీతో ఉన్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చితే ఏటా రూ.250 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని మంత్రికి అధికారులు వివరించారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన రుణ వివరాలు, వడ్డీ, చెల్లింపులు, పనుల పురోగతి, పూర్తి చేయడానికి అవసరమైన నిధులు తదితర అంశాలతో నివేదిక సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు.

తక్కువ పెట్టుబ డితో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రుణభారం లేని ఒక సాగునీటి సంస్థ ద్వారా నిధులను సమీకరించే అవకాశాన్ని మంత్రి పరిశీలించారు. శాఖకు చెందిన భూములు, ఇతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లో సిద్ధం చేసి వనరుల సమీకరణకు ఉపయోగించాలని వివరించారు.

భూసేకరణ పరిహారానికి ఇప్పటికే విడుదల చేసిన నిధులను ఆలస్యం చేయకుండా రైతులకు చేరేలా చూడాలన్నా రు.  సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇంజనీర్ ఇన్ -చీఫ్ (జనరల్) రమేష్‌బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.