2 May, 2026 | 10:39 AM

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

02-05-2026 09:34 AM

 జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం 

ఐకెపి సీసీ రామయ్య అవుట్..  అరుగురికి షోకాజ్ నోటీసులు

 అక్రమాల పాల్పడిన వారిపై  ఎఫ్ఐఆర్ నమోదు.

తుంగతుర్తి (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు ఎట్టి పరిస్తితుల్లో సహించేది లేదని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో జరిగిన అక్రమాలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు ఉపక్రమించారు  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, దళారులకు సహకరించిన గొట్టిపర్తి ఐకెపి సీసీ రామయ్యను సస్పెండ్ చేయగా తుంగతుర్తి తహశీల్దార్ దయానందం, తిరుమలగిరి తహశీల్దార్ హరి ప్రసాద్, ఎంపిడివో శేషు కుమార్, తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి రమేష్ బాబు, గొట్టిపర్తి ఐకేపీ బి టి ఎం జె. శ్వేత, తుంగతుర్తి ఏపిఎం ఎం.యాదమ్మ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

అక్రమాలు జరిగిన వెలిశాల, గోట్టిపర్తి, జలాలపురం, మామిడాల ఐకెపి కేంద్రాల ఏజెన్సీలను రద్దుచేసి వేరే ఏజెన్సీలకు కేటాయించడం జరుగుతుందని, డ్రైవర్, కమిషన్ ఏజెంట్ ( ట్రేడర్) పై క్రిమినల్ కేసు(ఎఫ్ఐఆర్) బుక్ చేయడం జరిగినదని అలాగే అక్రమాలు జరిగిన ఐకెపి సెంటర్ల మీద కూడా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకేపీ కేంద్రంలో రైతుల పేరిట విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా జిల్లా అధికారులతో కూడిన విచారణ బృందం విచారణ చేపట్టి ప్రాథమిక నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. తుంగతుర్తి మండలం లో కొన్ని సెంటర్లలో అమ్మకాలు జరిగాయని వాటి పైన కూడా అధికారులు విచారణ చేపడతామని అన్నారు.