29 May, 2026 | 3:03 AM

పంట వ్యర్థాలను కాల్చితే కఠిన చర్యలు

29-05-2026 02:19 AM

ఎస్సై చల్లా రాజు

వెంకటాపూర్, మే 28 (విజయక్రాంతి): పంట పొలాల్లో వరి కొయ్యలు, వ్యవసాయ వ్యర్థాలకు నిప్పు పెట్టి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపూర్ ఎస్త్స్ర చల్లా రాజు హెచ్చరించారు.

గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు.. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా విద్యుత్ మోటార్లు, గడ్డివాములు తగలబడి రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశముందని తెలిపారు. వేసవి వడగాల్పుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి సమీప ప్రాంతాలకు ప్రమాదం కలిగిస్తాయని అన్నారు.

అలాగే రోడ్ల వెంట పొలాల్లో మంటలు పెట్టడం వల్ల పొగ వ్యాపించి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తి రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్ని సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి పంట వ్యర్థాలను కాల్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్త్స్ర స్పష్టం చేశారు.