calender_icon.png 5 May, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు

24-04-2025 12:51:21 AM

మల్టీజోన్-2 డీఐజీ సత్యనారాయణ

సంగారెడ్డి, ఏప్రిల్ 23(విజయక్రాంతి) : ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా..రెచ్చగొట్టేలా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 డీఐజీ సత్యానారాయణ హెచ్చరించారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న శివాలయం ముందు ఉన్న శివుని విగ్రహం ధ్వంసం అయిన విషయమై మంగళవారం సాయంత్రం జిన్నారం మండలంలో జరిగిన సంఘటనలపై జిల్లా ఉన్నత అధికారులచే దర్యాప్తు చేయించినట్లు తెలిపారు. ఈనెల 19న సాయంత్రంసమయంలో కొన్ని కోతులు వచ్చి శివుని విగ్రహం గుట్టపై నుండి కిందికి తోసివేయడంతో కిందపడిన శివుని విగ్రహం ధ్వంసమైనట్లు విచారణలో తెలిందన్నారు.

కాగా మంగళవారం నాడు గేమ్స్ ఆడుకొని శివాలయం వైపు నుండి వస్తున్న మదర్సా విద్యార్ధులను చూసిన కొందరు స్థానికులు వారిని ప్రశ్నించిన అనంతరం శివాలయం వద్ద ధ్వంసమైన శివుని విగ్రహాన్ని చూసి, మదర్సా విద్యార్ధులే ఈ పని చేసినట్లుగా భావించి, పూర్తి వాస్తవాలను తెలుసుకోకుండా కొంత మంది వ్యక్తులు పెద్ద సంఖ్యలో వెళ్ళి మదర్సాలో ఆస్తినష్టం చేయడం జరిగిందన్నారు.

వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని, అట్టి వ్యక్తులపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గతంలో జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగాయని, గత 6 నెలల క్రితం సదాశివపేటలో ఓ గుడిలో ఆవులు ధ్వంసం చేస్తే, ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేయడం జరిగిందని, విచారణలో వాస్తవాలు రాబట్టి సమస్యకు పరిష్కారం చూపడం జరిగిందని అన్నారు.

ప్రజలు మత సామరస్యాన్ని పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని సూచించారు. జిన్నారంలో సమస్యను జటిలం కాకుండా త్వరితగతిన స్పందించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ను, మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధికారులను, సిబ్బందినిఐజి  అభినందించారు.