14-01-2026 12:27:21 AM
సంగారెడ్డి, జనవరి 13(విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్టమైన రహదారి భద్రతా చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆయా లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలపై కలెక్టర్ సమీక్షించారు.
బ్లాక్ స్పాట్స్ వద్ద గుర్తించిన అంశాలు, ప్రమాదాలకు కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో రహదారి భద్రతా చర్యలు కీలకమైనవని, ఇందుకోసం అన్ని శాఖల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి సమగ్ర ప్రణాళికతో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
నేషనల్ హైవే65లో గుర్తించిన జంక్షన్ల వద్ద సరిపడా లైటింగ్, సూచిక బోర్డులు, స్టడ్స్, బ్లింకర్స్ ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఆదేశించారు. పెద్ద చెట్ల వల్ల లైటింగ్ స్పష్టంగా కనిపించని చోట్ల మున్సిపల్ కమిషనర్, డీపీఓ సహకారంతో రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తదుపరి సమావేశానికి యాక్షన్ టేకెన్ రిపోర్టుతో హాజరు కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, ఎన్హెచ్‌ఏఐ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, డీఎం అండ్ హెచ్‌ఓ వసంత్ రావు, ఆర్డీవో రాజేందర్, జిల్లా రవాణా అధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు.