14-01-2026 12:25:25 AM
నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం
చిట్యాల, జనవరి 13(విజయక్రాంతి): స్థానికంగా నిర్మించిన 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కేటాయిస్తామని చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించిన నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం తెలిపారు. మంగళవారం మున్సిపాలిటి పరిధిలోని 01వ వార్డులోని శివనేనిగూడెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలోని ఒకటో వార్డులో పర్యటన చేశామని, ఈ వార్డులో ఉన్న ప్రజలు డంపింగ్ యార్డుతో ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని జననివాసానికి దూరంగా మార్చటానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. శివనేనిగూడెంలో ఇండ్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారని, గడిచిన పది సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో ఇండ్లు ఇవ్వలేదని, ఈ మార్చిలో 60 ఇందిరమ్మ ఇండ్లు ఈ వార్డుకు కేటాయిస్తామని పేర్కొన్నారు.
చెరువు పూడిక తీయిస్తామని, చిట్యాల లో అన్ని వార్డుల్లో ప్రతి పేద వారికి ఇండ్లు ఇస్తామని, చిట్యాల లో నిర్మించి ఉన్న 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, వనమా వెంకటేశ్వర్లు, కనక దుర్గాదేవి ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్, తాసిల్దార్ బి.విజయ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.