వాలీబాల్ ఆడుతూ విద్యార్థి మృతి
సీఎం కప్ పోటీల్లో విషాదం
వనపర్తి జిల్లాలో ఘటన
రూ.౫౦ లక్షల పరిహారం ఇవ్వాలని కుటుంబసభ్యుల ఆందోళన
వనపర్తి, డిసెంబర్ 7 (విజయక్రాంతి): సీఎం కప్ పోటీల్లో భాగంగా వాలీబాల్ ఆడుతూ ఛాతిలో నొప్పితో విద్యార్థి మృతి చెందిన ఘటన పెద్దమందడి మండలంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. పామిరెడ్డిపల్లి తండాకు చెందిన సాయి పునీత్ (15) బలిజపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. సీఎం కప్ క్రీడల్లో భాగంగా పాఠశాలలో శనివారం క్రీడా పోటీ లు నిర్వహించారు. ఉదయం ఖోఖో ఆడు తూ ఛాతిలో నొప్పి ఉందంటూ విరామం తీసుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత వాలీబాల్ ఆడుతుండగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కుప్పకూలాడు. ఉపాధ్యాయులు వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా విద్యార్థి ఆరోగ్య పరిస్థితి బాగా లేదన్న విషయం చెప్పినా వాలీబాల్ ఆడించడం వల్లే ఇలా జరిగి ఉంటుందని గిరిజన సంఘం నేతలు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
విద్యార్థి మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో రాజీవ్ చౌరస్తా వద్ద బైఠాయించి విద్యార్థి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకు బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్వీ నాయకులు మద్దతు తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని సముదాయించి పంపించే ప్రయత్నం చేశారు.




