18 June, 2026 | 3:13 AM

విద్యార్థుల భద్రతే లక్ష్యం

18-06-2026 02:06 AM

ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు ఉక్కుపాదం

విస్తృతంగా తనిఖీలు.. పలు వాహనాలు సీజ్

అలంపూర్, జూన్ 17: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే నిర్లక్ష్యానికి చెక్ పెట్టేందుకు రవాణా శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల బస్సులపై ప్రత్యేక దృష్టి సారించారు.ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూల్ బస్సులను గుర్తించి సీజ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన తనిఖీల్లో పలు లోపాలు వెలుగుచూడడంతో అధికారులు కఠిన చర్యలకు దిగారు.

ఫిట్నెస్ లేని బస్సులు సీజ్

పాఠశాలలు పునః ప్రారంభం అయిన నేపథ్యంలో గత మూడు రోజులుగా గద్వాల జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్ అయిజలో తనిఖీలు చేపట్టారు.అయిజ పట్టణంలో బుధవారం నిర్వహించిన తనిఖీల్లో కాకతీయ, వైష్ణవి పాఠశాలలకు చెందిన బస్సులను పరిశీలించిన అధికారులు వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడం గుర్తించారు. వెంటనే ఆయా వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.జిల్లా రవాణా శాఖ అధికారి రాధిక ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎంవీఐ రామ్ చరణ్ తెలిపారు.

ముఖ్యంగా అల్లంపూర్ నియోజకవర్గంలో అలంపూర్, అలంపూర్ చౌరస్తా, శాంతినగర్,రాజోళి,మానవపాడు ఎర్రవల్లి మండల కేంద్రాల్లో ప్రైవేటు పాఠశాలలు కొనసాగుతున్నప్పటికీ  అత్యధికంగా అయిజ,శాంతి నగర్ పట్టణాల్లో ఉన్న ప్రైవేటు స్కూల్ వాహనాలు భద్రతపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.విద్యార్థుల భద్రతకు ముప్పు

ఫిట్నెస్ గడువు ముగిసిన బస్సులు, అత్యవసర ద్వారాలు సరిగా లేకపోవడం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో లేకపోవడం, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేయకపోవడం వంటి లోపాలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.

నిబంధనలు తప్పనిసరి

పాఠశాల బస్సులకు చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్, బీమా, కాలుష్య నియంత్రణ ధృవపత్రం, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, మహిళా అటెండర్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని రవాణా శాఖ సూచిస్తోంది.పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నాయనే విమర్శలు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. పిల్లల భద్రత విషయంలో రాజీ పడకుండా అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

తనిఖీలు కొనసాగుతాయి

జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను దశలవారీగా తనిఖీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యమని నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తప్పవు అని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.