‘నీట్’ విద్యార్థులకు ఉచిత ప్రయాణం
ఈ నెల 21న ఆర్టీసీ బస్సుల్లో సౌకర్యం
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్‌లో మంత్రి అడ్లూరితో కలిసి ఆర్టీసీ బస్సు ప్రయాణం
కరీంనగర్, జూన్ 17 (విజయక్రాంతి): ఈ నెల 21న నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం కరీంనగర్ వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణించారు.
అనంతరం విద్యార్థులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. స్కూల్, కాలేజీల సమయానికి అదనంగా బస్సులు నడుపుతున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిందని, ఎన్నికలు పూర్తికాగానే గెలిచిన సంఘం నాయకులతో అధికారుల కమిటీలో విలీనం ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ మిల్క్ పథకాన్ని ప్రారంభించామన్నారు.
దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా తెలంగాణ ఆర్టీసీ అని, 10 వేలకు పైగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయన్నారు. కాగా అసత్యపు ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి హరీష్‌రావును మంత్రి పొన్నం ప్ర భాకర్ హెచ్చరించారు. జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్ స్వామి, చొక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో, ఇప్పుడు నేను, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అలాంటి రాజకీయాలు చేస్తున్నామన్నారు.






