30-12-2025 11:49:15 AM
సైన్స్ ఫెయిర్ వద్ద తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు
ఆదరాబాదరాగా సైన్స్ ఫెయిర్ ప్రదర్శన.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ పాఠశాలలో విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి వసతులు కొరవడ్డాయి. సైన్స్ ప్రదర్శనలు తిలకించేందుకు వచ్చిన విద్యార్థులు ఎండలోనే నిలుచుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత టాలెంట్ బయటికి తీసి సైన్స్ పట్ల మక్కువ పెంచేందుకు ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ దినోత్సవ కార్యక్రమానికి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను విద్యాశాఖ ప్రోత్సహించాల్సి ఉంది.
కానీ ఈ ఏడాది ఆదర బాధరాగా కేవలం రెండు రోజులు మాత్రమే సైన్స్ ఫెయిర్ ప్రదర్శన ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఇతర విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయడంలో మాత్రం జిల్లా సైన్స్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలుస్తోంది. సోమవారం ప్రారంభించి మంగళవారం మరునాడే ముగింపు చేయడంతో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తిలకించేందుకు ఇబ్బందులు పడ్డారు. వచ్చామా వెళ్ళామా అనే విధంగా ప్రదర్శన తిలకించేందుకు సమయం ఇవ్వకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. మంగళవారం ఒకేరోజు అన్ని పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఫెయిర్ తిలకించేందుకు రావడంతో తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య పెరిగి ఆరు బయట ఎండలోనే గంటల తరబడి కూర్చోబెట్టారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య కనుగుణంగా టెంట్ ఏర్పాటు చేయడంలోనూ విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.