12-12-2025 12:00:00 AM
అధికారుల నిర్లక్ష్యం పై విమర్శలు
మోర్తాడ్, డిసెంబర్11 (విజయ క్రాంతి):నిజామాబాద్ సహా పలు మండలాల్లో గత నాలుగు రోజులుగా మీసేవ సర్వర్ పనిచేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాలకు వచ్చే విద్యార్థులు గంటల తరబడి నిలబడి పోయినా సేవలు అందక నిరాశ చెందుతున్నారు.
సర్వర్ అంతరాయం ఏర్పడడానికి గల కారణాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు దగ్గరపడుతున్న సమయంలో మీసేవ సేవలు అందుబాటులో లేకపోవడం విద్యార్థుల్లో ఆందోళ నను పెంచుతోంది. సర్టిఫికేట్లు జారీ కాకపోవడంతో అనేక ఫిర్యాదులు నమోదు కాగా, సమస్యపై సంబంధిత విభాగ అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి పెంచుకోస్తోంది.
విద్యార్థుల సౌలభ్యం కోసం మీసేవ సేవలను తక్షణమే పునరుద్ధరించాలని, సర్వర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మీసేవ వంటి కీలక సేవల నిలిచిపోవడం వల్ల వేలాది మంది సాధారణ ప్రజల ఇతర పనులు కూడా నిలిచిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.