విద్యార్థులతో బలవంతంగా అండర్ టేకింగ్ లెటర్లు
- మూడు నెలల్లో ఫీజు కడతామని రాయించుకుంటున్న ఇంజినీరింగ్ కాలేజీలు
- రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రేవంత్ సర్కారు చేతులెత్తేసి.. పేద విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నదని బీఆర్‌ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కాలేజీలన్నీ విద్యార్థుల నుం చి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. విద్యార్థులతో బలవంతంగా సంతకాలు చేయించి అండర్ టేకింగ్ లెటర్లు రాయించుకొని తీసుకుంటున్నారని చెప్పారు.
త్వరలో బీటెక్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించలేదన్నారు. దీంతో పరీక్ష ఫీజు కట్టాలంటే ముందుగా విద్యార్థులతో మూడు నెల ల్లో ఫీజు చెల్లిస్తామని ఇంజినీరింగ్ కాలేజీలు లెటర్లు రాయించుకుంటున్నా యని తెలిపారు. ఒక వేల జూలైలోపు ఫీజు చెల్లించకపోతే క్లాసులకు హాజరుకాకుండా అడ్డుకోవచ్చని, పరీక్ష ఫలితా లు కూడా ఆపేయవచ్చని, దీనికి అంగీకరిస్తున్నట్టు విద్యార్థులతో సంతకాలు చేయించుకుంటున్నారని వివరించారు.
శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడారు. సర్కారు నిర్లక్ష్య వైఖ రి వల్ల ఇప్పటికే చదువు పూర్తున 13 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులే ఫీజు చెల్లించుకోవాలని కోర్టు చెప్ప డంతో ఇప్పుడు చదువుకుంటున్న మరో 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలు కూడా అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇకపై డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే బీటెక్‌లో అడ్మిష న్లు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని, రే వంత్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అవుతోందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసు కొచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ మంచి పథకమని అని కేసీఆర్ కొనసాగించారని గుర్తుచేశారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని పూర్తిగా రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి బుద్ధి తెచ్చుకుని పేద విద్యార్థుల బతుకులు ఆగం కాకుం డా కాపాడాలని కోరారు. లేకుంటే విద్యార్థుల పక్షాన తాము రోడ్డెక్కి సర్కారు దుష్ట బుద్ధిని ఎండగడతామని హెచ్చరించారు.






