calender_icon.png 15 November, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలి

15-11-2025 01:25:28 AM

  1. పభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ 

పాలిటెక్నిక్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవాలు 

పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ 

నిజామాబాద్, నవంబర్ 14 :(విజయ క్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాలను శుక్రవారం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు.

వసతి గృహ నిర్మాణాల కోసం పూర్వ విద్యార్థి ప్రతాప్ రెడ్డి రూ. 1.06 కోట్ల విరాళం అందించగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద  భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ రూ. 2.86 కోట్ల నిధులను విరాళంగా అందజేసింది. ఈ నిధుల తోడ్పాటుతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బాల, బాలికలు,  ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం వేర్వేరుగా నిర్మించిన నూతన వసతి గృహాలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సహచర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా పి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో గత పదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను బలోపేతం చేయాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృత చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఆధునిక సాంకేతిక విద్యను అభివృద్ధి చేయడం ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో మెరుగైన సాంకేతిక విద్యను బోధిస్తూ, విద్యార్థిని, విద్యార్థులకు ఉజ్వల భవితవ్యానికి బాటలు వేయాలని అధ్యాపకులకు సూచించారు. ఈ మేరకు అవసరమైన అన్ని మౌలిక, వసతి సదుపాయాలను కల్పించేందుకు తమవంతు కృషి చేస్తామని అన్నారు. దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలువాల్సిన విద్యార్థులు సైతం క్రమశిక్షణతో మెలుగుతూ సాంకేతిక విద్యతో కూడిన అంశాలను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, నేటి సామాజిక అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక విద్యతో కూడిన కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో నూతనంగా 66 అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. నిర్దేశిత కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు సత్వరమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుందని,  టాటా కంపెనీతో ఒప్పందం సైతం కుదుర్చుకుందని తెలిపారు.

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశ ప్రగతికి ప్రణాలికాబద్దంగా కృషి చేసిన దార్శనికుడు, దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టళ్ళను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి ఎనలేని ప్రాధాన్యతస్తూ పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిజామాబాద్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు.

ఇందులో భాగంగానే ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేయించామని గుర్తు చేశారు. దీంతో పాటు డిచ్పల్లి తెలంగాణ విశ్వ విద్యాలయంలో అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా నెలకొల్పేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. కాగా, వసతి గృహాల నిర్మాణాల కోసం విరాళం అందించిన పూర్వ విద్యార్థి ప్రతాప్ రెడ్డిని, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సహాయ జనరల్ మేనేజర్ సెల్వంలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.

రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భారతి  రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ అనురాధ,

పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పి బాల నరసింహులు, ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, పూర్వ విద్యార్థులు ఏం విగ్నేష్, ఆర్ మోహన్ కుమార్, వినోద్, ఎం గణేష్, శంకర్, బాబా, శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రభాకర్, ఆనంద్, కళాశాల లెక్చరర్స్ కే నాగరాజ్, టి రవీందర్, భానుచందర్, గోపాల్ నాయక్, ప్రవీణ్, ప్రదీప్ రెడ్డి, ఎన్సిసి ఆఫీసర్ ఆర్ నరేష్, ఎన్సిసి, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు  పాల్గొన్నారు.