23 July, 2026 | 12:36 AM

విద్యార్థుల హక్కులను కాపాడాలి

23-07-2026 12:06 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూలై 22 (విజయక్రాంతి): దేశంలో విద్యా వ్యవస్థను సరిచేసి విద్యార్థుల హక్కులను కాపాడాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులతో కలిసి రాజ్ భవన్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు.

నీట్ పేపర్ లీకేజీ ద్వారా వారి భవిష్యత్తుపై నీళ్లు చల్లిందని ఆరోపించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని తప్పుబట్టారు. వారికి మద్ధతుగా వెళ్లిన రాహుల్ గాంధీని రక్తం వచ్చేలా కొట్టడం గర్హణీయమని.. ఇది బిజెపి నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ఆగ్రహించారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.