27-10-2025 07:04:06 PM
అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి..
అశ్వాపురం (విజయక్రాంతి): మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా సోమవారం అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ నుండి జగదాంబ సెంటర్ వరకు ప్లకార్డులు పట్టుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల వాడకాన్ని సమూలంగా నిర్మూలించాలంటే యువత ముందుండాలని, విద్యార్థులే అవగాహన దూతలుగా మారాలని సూచించారు.
మాదక ద్రవ్యాలను సేవించడం వలన వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా ఎదురయ్యే ప్రమాదాలు, అలాగే చట్టపరంగా పడే శిక్షలను విద్యార్థులకు వివరించారు. అసాంఘిక కార్యకలాపాలు లేదా డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించిన సమాచారం తెలిసినవారు వెంటనే స్థానిక పోలీసులను లేదా 100 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాను పూర్తిగా మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తోందని, ప్రజలందరూ సహకరించాలని సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎస్‌ఐ రాజేష్, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.