17 July, 2026 | 12:20 AM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు సహకరించాలి

17-07-2026 12:20 AM

ఎస్‌ఐ మధు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూలై 16: మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని అర్వపల్లి ఎస్‌ఐ పి మధు అన్నారు. గురువారం మండల పరిధిలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ లో అర్వపల్లి పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకొని చదువుపై విద్యార్థులు పూర్తి దృష్టి సారించాలని సూచించారు.సరదా కోసం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే జీవితంతో పాటు కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు.డ్రగ్స్,గంజాయి వంటి మాదకద్రవ్యాలు శారీరక,మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా చట్టపరంగా కఠిన చర్యలకు కూడా దారి తీస్తాయని వివరించారు.

పాఠశాల పరిసరాల్లో లేదా గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి వంటి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసినా,అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రతి విద్యార్థి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి మల్లేష్,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,పోలీసు సిబ్బంది,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.