25 June, 2026 | 2:36 AM

దుర్వ్యసనాల బారిన పడి విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

25-06-2026 01:59 AM

-కోదాడ డీఎస్పీ ఆర్. శ్రీనివాస్ రెడ్డి

నేరేడుచర్ల, జూన్ 24: క్షణికానందం కోసం వ్యసనాల బారిన పడి విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును, జీవితాలను నాశనం చేసుకోవద్దని కోదాడ డీఎస్పీ ఆర్. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, దుష్పరిణామాలు మరియు చట్టపరమైన చర్యలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ,డ్రగ్స్, మాదకద్రవ్యాల అలవాటు వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను విద్యార్థులకు వివరించారు.

డ్రగ్స్ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరంగా కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని, క్రిమినల్ కేసులు నమోదైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని, ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్ ఐ. ఏ. సైదిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణతో పాటు బోధనా సిబ్బంది పాల్గొన్నారు.