యువతే దేశ భవిష్యత్తు
వనపర్తి డీసీసీ చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ శివసేన రెడ్డి
వనపర్తి టౌన్ జూన్ 24: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని వనపర్తి డీసీసీ చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ శివసేన రెడ్డి విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు, ఉద్యోగ నియామ కాలలో జాప్యం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు గళమెత్తా లని పిలుపునిచ్చారు. ‘ఛాత్రోన్ కి గుంజ్‘ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు కేటాయిస్తున్న నిధుల కంటే విద్యార్థుల తల్లిదండ్రులు భవిష్యత్తు కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. యువతను విస్మరిస్తే ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పవని అన్నారు. విద్య, ఉద్యోగాలు, భవిష్యత్తు కోసం విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






