11-11-2025 05:56:44 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగంలో కూడా ఉత్తమ ప్రతిభను కనబరిచాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణిస్తూ సామాజిక దృక్పథం కలిగి ఉండాలని తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయని, స్నేహభావం పెంపొందుతుందని, నాయకత్వ లక్షణాలు అలవడతాయని తెలిపారు.
క్రీడలతో చదువులో ఏకాగ్రత పెరుగుతుందని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ గోడ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తుందని తెలిపారు. 2025-26 మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడంతో విద్యార్థులు పోటీలలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారని అభినందించారు. ఈ పోటీలలో జిల్లాలోని గుడిపేట బాలుర జట్టు మొదటి బహుమతి, నిర్మల్ జిల్లా బాలుర జట్టు ద్వితీయ బహుమతి గెలుపొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.