5 June, 2026 | 1:13 AM

ఇసుక రీచ్‌ల గుర్తింపు, తవ్వకాలపై అధ్యయనాలు చేపట్టాలి

05-06-2026 12:00 AM

గోదావరి పరిధిలో ఇసుక తవ్వకాల అనుమతులు లేవు ః కలెక్టర్

జగిత్యాల, జూన్ 4: ఇసుక రీచ్ల గుర్తింపు, తవ్వకాలపై క్షేత్రస్థాయి అధ్యయనాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. జిల్లాలో ఇసుక నిల్వ ప్రాంతాల గుర్తింపు, భూగర్భ జల శాఖ సాధ్యాసాధ్యాల నివేదికలు, స్థానిక అవసరాలు , ప్రభుత్వ పనుల కోసం ఇసుక అందుబాటుపై జిల్లా స్థాయి ఇసుక సమన్వయ కమిటీ (డీ.ఎల్.ఎస్.సీ) సమావేశం గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధ్యక్షతన జిల్లా ఎస్ పి అశోక్ కుమార్ తో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఇసుక రీచ్లు అందుబాటులో లేవని, వర్షాకాలం అనంతరం పరిస్థితులను సమీక్షించి ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ముగిసిన తర్వాత భూగర్భ జల శాఖ ద్వారా సమగ్ర అధ్యయనాలు నిర్వహించి భవిష్యత్తులో ఇసుక తవ్వకాలకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బలహీన వర్గాల గృహ నిర్మాణాల కోసం మినహా ప్రతి ఇసుక లావాదేవీ ఆన్లైన్ విధానంలోనే జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇసుక తవ్వకం, రవాణా, విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ధర్మపురి మండల పరిధిలో గోదావరి నదిలో ప్రస్తుతం అధికారికంగా ఎటువంటి ఇసుక తవ్వకాల అనుమతులు లేవని కలెక్టర్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా జరగకుండా రెవెన్యూ, పోలీసు, గనుల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  ఈ సమావేశంలో  అదనపు ఎస్ పి చేతన్ నితిన్, అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, రెవెన్యూ డివిజనల్ అధికారులు మధుసూదన్, జి. నర్సింహారావు, దివాకర్ రెడ్డి, జిల్లా భూగర్భ జల అధికారి శ్రీకాంత్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఈ. మురళి, గనులు, భూగర్భశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.