10-12-2025 04:05:53 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేనందువల్ల, నెలనెలా వేతనాలు ఆలస్యం కావడంతో పాటు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నందున, వైద్య విధాన పరిషత్ ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేసి ట్రెజరీ సాలరీస్ పరిధిలోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కోరుతూ రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన సామూహిక వినతి పత్రాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏరియా హాస్పిటల్ తుంగతుర్తి ఉద్యోగులు ఆర్ఎంఓ డాక్టర్ ఉపేందర్ ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతిపత్రం అందచేయడం జరిగింది.
ఐతే గతంలోనే వైద్య విధాన పరిషత్ ఉద్యోగ సంఘాలు అన్నీ కలిసి జేఏసీ గా ఏర్పడి చేసిన పోరాటం ఫలితంగా ప్రభుత్వం స్పందించి వైద్య విధాన పరిషత్ ను రద్దు చేసి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు కు సుముఖత వ్యక్తం చేస్తూ అందుకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అవసరమైన విధివిధానాలను సూచిస్తూ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.ఏడాది కాలం గడిచినా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
అందుకోసం ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ ఆకాంక్షను గుర్తించి వైద్య విధాన పరిషత్ ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేసి తమను ట్రెజరీ జీతాల పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నాము.అలాగే సెకండరీ హెల్త్ సర్వీసెస్ ను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, శాస్త్రీయంగా సిబ్బంది సంఖ్యను ప్రతిపాదించాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది కరుణాకర్, సువర్ణ, నాగమణి, అనిత, నర్సింగ్ ఆఫీసర్స్, కవిత తదితరులు పాల్గొన్నారు.