10-12-2025 04:10:04 PM
విజేతల బృందానికి 1.5 లక్షల నగదు పురస్కారం
పటాన్ చెరు: జాతీయ స్ఠాయి పోటీలలో గీతం విద్యార్థులు మరోసారి రాణించారు. అహ్మదాబాద్ (గుజరాత్) నోడల్ సెంటర్ లో ఇటీవల జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్) 2025ను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు జట్టు గెలుచుకుంది. ఆ జట్టు వినూత్న సాంకేతిక పరిష్కారాన్ని మెచ్చిన జ్యూరీ ₹1.5 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసి సత్కరించింది. బీటెక్ సీఎస్ఈ & ఏఐఎంఎల్ రెండో యేడాది విద్యార్థులు కె.కృష్ణప్రియ, అబ్దుల్ బాసిత్ హసన్ షేక్, కె.అమోఘ్, కర్మన్ ఘాట్ యశ్వంత్, యుక్త చావలి, శరణ్య మదీనాలతో కూడిన విజేత బృందం – ప్రభుత్వ ఈ-కన్సల్టేషన్ మాడ్యూల్ ద్వారా సమర్పించే ప్రజా వ్యాఖ్యల యొక్క సెంటిమెంట్ విశ్లేషణ కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వేదికను అభివృద్ధి చేసింది.
విధాన రూపకర్తలు సెంటిమెంట్, విధాన వైఖరిని వర్గీకరించడం, సారాంశాలను రూపొందించడం, సాక్ష్యం ఆధారిత నిర్ణయం తీసుకోవడాన్ని ప్రారంభించడం ద్వారా ముసాయిదా చట్టాలు, నిబంధనలపై పౌరుల అభిప్రాయాన్ని పెద్ద మొత్తంలో సమర్థవంతంగా విశ్లేషించడానికి ఈ ఏఐ వేదిక సహాయ పడుతుంది. ఈ బృందానికి మార్గదర్శి (మెంటార్)గా వ్యవహరించిన డాక్టర్ చంద్రశేఖర్ ఉద్దగిరి, విద్యార్థుల విజయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘ఈ అద్భుతమైన బృందానికి మార్గదర్శకత్వం వహించడం చాలా గర్వకారణం. వారి పరిష్కారం, దాని ఆవిష్కరణ, సాధించగల ప్రభావం జ్యూరీని ఆకట్టుకుంది. వారి కృషి, అంకితభావానికి విద్యార్థులందరికీ అభినందనలు’ అని ఆయన వ్యాఖ్యానించారు. గీతం హైదరాబాదులోని వెంచర్ డెవలప్ మెంట్ సెంటర్ (వీడీసీ) సహకారానికి డాక్టర్ చంద్రశేఖర్ కృతజ్జతలు తెలియజేశారు.
విద్యార్థుల ఈ చొరవకు వీడీసీ మద్దతు ఇవ్వడమే గాక, జాతీయ స్థాయి కార్యక్రమంలో విద్యార్థుల బృందం పాల్గొనడానికి సాయపడింది. విశ్వవిద్యాలయ నాయకత్వం నుంచి నిరంతర ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా వీడీసీ గుర్తు చేసుకుంది. తమకు వెన్నుదన్నుగా ఉంటున్న సీఎస్ఈ & ఏఐఎంఎల్ విభాగాధిపతులు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, వీడీసీ డిప్యూటీ డైరెక్టర్, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్-డీన్ లతో పాటు గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి తదితరులకు వీడీసీ కృతజ్జతలు తెలియజేసింది. ఆవిష్కరణ, అనుభవపూర్వక అభ్యాసంపై వారి నిరంతర సహకారం, ఈ ప్రతిష్టాత్మక జాతీయ విజయంలో కీలక పాత్ర పోషించినట్టు వీడీసీ తెలియజేసింది.