1 August, 2026 | 6:43 PM

వరద నష్టంపై పూర్తి వివరాలు సమర్పించండి

03-09-2025 12:19 AM

జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష 

నిజామాబాద్, సెప్టెంబర్ 2 :(విజయ క్రాంతి) : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాటిల్లిన నష్టాలపై సమగ్ర వివరాలతో తక్షణమే ప్రభుత్వానికి నివేదికలు పంపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో భారీ వర్షాలు,

వరద సహాయం పైన సెక్రటేరియట్ నుండి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావానికి గురైన జిల్లాలలో నెలకొని ఉన్న పరిస్థితి గురించి కలెక్టర్లను  వాకబు చేశారు. తక్షణ సహాయక చర్యల కోసం నిధులు మంజూరు చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. విపత్తు సహాయ నిధిని కూడా ఆయా అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు.

వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లోనూ మరో నెల రోజుల వరకు ఇదే రీతిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు చేసినందున ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, కలెక్టర్, ఎస్పీలు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలని, సహాయక చర్యలు ముమ్మరంగా జరిగేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.