క్రీడా స్ఫూర్తితో విజయం సాధించాలి
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): క్రీడాకారులు తాము పాల్గొనే పోటీలలో క్రీడాస్ఫూర్తితో ఆడి విజయం సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలో భాగంగా శనివారం ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు, ఆర్ & ఆర్ కాలనీ (పాడింబండ) గ్రామాలలో గ్రామపంచాయతీ స్థాయి సీ.ఎం. కప్-2024 క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సీ.ఎం. కప్-2024 క్రీడా పోటీలను గ్రామపంచాయతీ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలలో నిర్వహించి ఆయా స్థాయిలలో ఉత్తమ ప్రతిభతో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు ఆటలలో గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలని, తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని తెలిపారు. జిల్లాలో క్రీడాకారులకు కొదువ లేదని, జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణిన్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది క్రీడా రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ క్రీడాభివృద్ధి అధికారి మీనారెడ్డి, పి.ఈ.టి.లు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రలో మొదటి స్థానంలో నిలుపాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులతో వార్షిక పరీక్షల నిర్వహణ, ఫలితాల సాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే ఇంటర్మీడియట్ వార్పిక పరీక్షలలో అత్యున్నత ఫలితాలు సాధించి జిల్లాను ముందు వరుసలో ఉండేలా అధ్యాపకులు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్స్ గురుకుల కళాశాలలు 48 ఉన్నాయని, విద్యార్థుల హాజరు శాతం పెంపొందించి క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, వార్షిక పరీక్షలకు ఇంకా 80 రోజులు మాత్రమే ఉన్నాయని, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు.
ఈ క్రమంలో కార్యచరణ రూపొందించుకొని ఆ ప్రకారంగా విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి అపోహలు, భయం లేకుండా పరీక్షలకు హాజరయ్యే విధంగా మనోధైర్యాన్ని కలిగించాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతులు నిర్వహించాలని, కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. నషా ముక్త్ భారత్ క్రింద కళాశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అధ్యాపకులు, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని, జిల్లాను గతంలో కంటే మెరుగైన స్థానంలో ఉండే విధంగా అందరు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కళ్యాణి, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, కళాశాలల ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.




