గురుకుల విద్యార్థుల ప్రాణాలాంటే ఎందుకు చులకన
బిఆర్ఎస్ చెన్నూరు ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్...
మందమర్రి (విజయక్రాంతి): గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల ప్రాణాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చులకన భావం ఎందుకని బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ డాక్టర్ రాజా రమేష్ ప్రశ్నించారు. గురుకుల బాటలో భాగంగా జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను శనివారం గురుకుల బాట జిల్లా ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్యతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేయడం జరుగుతుందన్నారు. గురుకుల పాఠశాలల్లో సరైన సౌకర్యాలు సరిగా లేక ఫుడ్ పాయిజన్ తో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 48 మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రజా పాలనలో గురుకులాలు బ్రష్టు పట్టి విద్యార్థుల మరణాలకు నిలయాలుగా మారాయని విమర్శించారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలు పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేక అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురుకులాలపై కనీసం సమీక్ష చేసే తీరిక సమయం దొరకడం లేదని అయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిబిజికేఎస్ కేంద్ర కమిటీ నాయకులు బడికల సంపత్, జైపూర్ మండల మాజీ జడ్పీటీసీ మేడి సునీత తిరుపతి, పిఎసిఎస్ చైర్మన్ సంబగౌడ్, మాజీ ఎంపీటీసీలు బడుగు రవి, లింగస్వామి, మాజీ సర్పంచ్ రాజమల్లు పాల్గొన్నారు.




