పాక్‌లో ఆత్మాహుతి దాడి
- బలూచ్ కోస్ట్‌గార్డులోకి దూసుకొచ్చిన ట్రక్కు
- కొద్ది క్షణాల్లోనే భారీ పేలుడు..
- 30 మంది పాకిస్తాన్ సైన్యం మృతి
- మా పనే..: బీఎల్‌ఏ
ఇస్లామాబాద్, జూలై 4: బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో ఉన్న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై జరిగిన ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్తాన్‌లోని కోస్ట్‌గార్డు బేస్‌లోకి ట్రక్కు దూసుకొచ్చింది. క్షణాల్లోనే భారీ పేలుడు సంభవించి, మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ దాడిలో 30 మంది పాకిస్తాన్ అంతర్గత బలగాల సిబ్బంది మృతిచెందారు. ఈ దాడి చేసింది ‘మేమే’ అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది.
జివానీ ప్రాంతంలోని పన్వాన్ కోస్ట్ గార్డ్ బేస్‌ను పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో లక్ష్యంగా చేసుకున్నట్లు బీఎల్‌ఏ వెల్లడించింది. దీన్ని ఆత్మాహుతి వాహన ఆధారిత పేలుడు పరికరం (ఎస్‌వీబీఐఈడీ) ఆపరేషన్‌గా పేర్కొంది. బీఎల్‌ఏ ప్రతినిధి జియాండ్ బలూచ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. భారీ పేలుడుతో కోస్ట్ గార్డ్ శిబిరం తీవ్రంగా దెబ్బతిందని, అనంతరం తమ ఫతే స్క్వాడ్ సభ్యులు అన్ని వైపుల నుంచి దాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ దాడిలో పాకిస్తాన్ పారామిలిటరీ దళాలకు చెందిన 30 మందికి పైగా సిబ్బంది మరణించినట్లు తెలిపారు. డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని బీఎల్‌ఏ తెలిపింది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నందున మృతుల సంఖ్య పెరగవచ్చని కూడా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన 43 సెకన్ల వీడియోను బీఎల్‌ఏ మీడియా విభాగం విడుదల చేసింది. అయితే, ఈ దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఈ ఘటనపై పాకిస్తాన్ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌లో నిషేధిత వేర్పాటువాద సంస్థగా గుర్తింపు పొందింది. బలూచిస్తాన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, ఇతర లక్ష్యాలపై గతంలో కూడా పలు దాడులకు పాల్పడినట్లు ఆ సంస్థ ప్రకటించింది. తాజా ఘటనతో ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.






