ఘనంగా రెజ్లింగ్ అకాడమీలో సమ్మర్ క్యాంప్ టోర్నమెంట్
సికింద్రాబాద్, జూన్1 (విజయ క్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రోంలో ఉన్న స్టాగ్ రెస్లింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ రెస్లింగ్ టోర్నమెంట్2026ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ రెస్లింగ్ కోచ్ కె. యశ్వంత్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్కు డబ్ల్యూసీడబ్ల్యూఓ మెడికల్ మిషన్ హెడ్ డా. ఎం . అభిషేక్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.
క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో రాంచరణ్ తొలి స్థానం సాధించి విజేతగా నిలిచాడు. ఆకాష్ ద్వితీయ స్థానం, విఘ్నేష్ తృతీయ స్థానం దక్కించుకున్నారు.
విజేతలకు అతిథులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా కోచ్ కె. యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, యువతలో రెస్లింగ్ క్రీడపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అకాడమీ కృషి చేస్తోందన్నారు.






