19-05-2025 12:00:00 AM
తాతీల్‌లలో అమ్మగారింట్లో
గడిపిన బాల్యం మరువలేనిది...
మళ్లీ రానిది
వాళ్లకు తెలిసినన్ని ఇకమతులు
ఇప్పటికీ మనకు తెల్వయి
వాళ్లు పలికే శాత్రాలు
తర్వాయిబట్టి
ఒకటి తర్వాత ఒకటి
ఒడవకుండా శాంతాడు లెక్క
వస్తనే ఉంటాయి
అజా కాకముందే
ఎగిలి వారంగనే లేవాలె అని
నేర్పిన ఆరోగ్య సూత్రాలు
కష్టం చేసి బతకాలె బిడ్డా
దొడ్డు బట్ట దోసెడు
అంబలి కోసమే
చేసేదంతా అని చెప్పిన
నీతి సూత్రాలు
ఎప్పటికీ ఆచరణీయాలు
గడ్డికోసి దుడ్డేకేసి బర్రెకు
కుడితికి పెట్టి
చంటిపిల్లలా చూసుకొని
సున్నితత్వాన్ని బోధించి
ప్రేమ నేర్పిన ప్రేమ పంచిన
పెద్దమనుషులు మూడురాళ్ల పొయ్యి మీద
వంట మొత్కాకుల ఇస్తార్లు
ఇంక ముత్తేమంత తిను బిడ్డ
అన్న ప్రేమ ఏడ దొరికాల్నే అవ్వ
మంచినీళ్ల బాయికాడ
మంచినీళ్లు ఎత్తుకొచ్చి
కలుషితం కాని నీళ్లు తాపిన
కల్మషం లేని మంచి మనసులు
బుర్రకాయతో ఈతకు దింపి
భయం పోగొట్టిన ధైర్యశాలులు
నెత్తిన రుమాలు చుట్టుకొని
కిర్రు చెప్పులు వేసుకొని
కాలుకు ముల్లు నాటకుండా
భుజాన ఎత్తుకొని
బోడగుట్ట చెరువుకట్ట మీదికెళ్లి
సావటిదాకా సవారు చేసినం
ఏడ దొరుకుతది తాత
అంతకు మించిన సింహాసనం
ఎంత అలసినా మొగురానికి
ఒరిగి పగటి నిదుర
పనికి చేటు అని
పిట్టకునుకు తీసిన నాడు
సమయం విలువ తెలిసింది
పొద్దు గూకంగానే బుక్కెడు తిని
నులక మంచం వేసుకొని
మొగలువైపు చూస్తు
ఆడుకుంట పాడుకుంట
పొడుపు కథలు విప్పి చెప్పి
జీవన నైపుణ్యాలు నేర్పెటోళ్ళు
తాటిముంజలు తెచ్చి
పలంచే మీద పెట్టి
ఈత పండ్లు తెచ్చి తనాబిల దాచి
మామిడి పండ్లు తెచ్చి
అర్రల మాగేశి
దాచి దాచి ఇచ్చిన ప్రేమ
ఇప్పుడు ఏడ దొరుకుతది తాత
గోటీలు గిల్లిదండ అష్టాచెమ్మా పచ్చీసలు
తాటిముంజ కాయల బండ్లు
ఇచ్చిన ఆనందం
సొప్పతో ఫంక చేసి ఉరికిన రోజులు
ఇపుడు విమానాలు కూడా ఇయ్యయి
పాతాళ్ల గరిగెతో దేవినట్టు
ప్రతి ఎండాకాలం తాతీల్లల్ల
అమ్మగారిల్లె యాదికస్తది
అమ్మమ్మ తాతనే గుర్తుకస్తరు.
(తాతీల్ = సెలవులు)