02-05-2025 10:26:04 PM
ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా...
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూత నివ్వడం జరుగుతోందని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ కు చెందిన ఫీక్కీఫ్లో లేడీస్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా జిల్లాలో ఇత్తడితో వస్తువులు, బొమ్మలను తయారు చేస్తున్న వారికి చేయూతనిచ్చేందుకు స్థానిక కొమరం భీమ్ కాంప్లెక్స్ లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు తయారు చేసిన ఇత్తడి వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా తయారీదారులకు పలు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఫీక్కీఫ్లో లేడీస్ ఆర్గనైజేషన్ వారు సుమారు 200 వరకు ఇత్తడి వస్తువుల కొనుగోలు కోసం ఆర్డర్ తీసుకున్నారు. సమావేశంలో ఫీక్కీఫ్లో లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ ప్రతిభ, సభ్యులు కవిత రెడ్డి, దీప్తి, శీతల్, ఐటీడీఏ జేడీఎం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.