21 May, 2026 | 2:35 AM

కులగణనపై సుప్రీం చారిత్రాత్మక తీర్పు

21-05-2026 12:17 AM
  1. కేంద్ర ప్రభుత్వ విజయమే
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య 

ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి): జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు అగ్ర కులాల వారు సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టి వేయడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక విజయమన్నారు. ఈ మేరకు బుధవారం విద్యానగర్ బీసీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడారు.

కొందరు అగ్రకులాల వారు వేసిన పిటిషన్లను సుప్రీం తప్పుపట్టిందన్నారు. భారతీయ సమాజం కులం పునాదులపై నిర్మించబడిందని,  ప్రజల సామాజిక, ఆర్థిక, జీవన విధానంలో కులం ప్రభావితం చేస్తుందని సుప్రీం పేర్కొనడం హర్షణీయమన్నారు. సమాజంలో వెనకబడిన కులాలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజికాభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఈ లెక్కలు అవసరమన్నారు.

ఏ కులం ఏ రంగంలో వెనకబడి ఉంది, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, నిర్ణయాలు అవసరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించిందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు పల్లగొర్ల మోడీ రాందేవ్, భీమరాజు, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.