29 May, 2026 | 2:56 AM

తెలుగు సమాజం గర్వించదగిన మహానీయుడు సురవరం ప్రతాపరెడ్డి

29-05-2026 12:00 AM

గోలకొండ పత్రిక స్థాపన ద్వారా ప్రజలను చైతన్య పరిచిన మహానుభవుడు

పత్రిక విలువలు క్షీణిస్తే ప్రజాస్వామ్యం కూడా క్షీణిస్తుంది

పూర్వ భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

తెలుగు అనగానే గుర్తొచ్చే వారిలో సురవరం ప్రతాపరెడ్డి ముందు వరుసలో ఉంటారు

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్‌రెడ్డి

ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి): బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి అని, నిజాం పాలనలో తెలుగు మాట్లాడడానికే భయపడు తున్న రోజుల్లో గోలకొండ పత్రికను స్థాపించి, ప్రజలను చైతన్య పరిచేందుకు విశేషంగా కృషి చేశారని పూర్వ భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. 

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌ని సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంలో గురువారం సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి అధ్యక్షతన సురవరం ప్రతాప రెడ్డి130వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిరహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా పూర్వ భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిధా రెడ్డి, శాంతా వసంతా ట్రస్ట్ వ్యవస్థాపకులు, పద్మ భూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ట్రస్ట్ కార్యదర్శి సురవరం పుష్పలత రెడ్డి లు హాజరై సురవరం ప్రతాప రెడ్డి  చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వెంకయ్య నాయు డు చేతుల మీదుగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డికి సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య  పురస్కారం ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తెలుగు సమాజం గర్వించదగిన మహానీయుడు సురవరం ప్రతాప రెడ్డి అని పేర్కొన్నారు. 

తెలుగు జాతి అనగానే గుర్తొచ్చే ముగ్గురు వైతాళికులు కందుకూరి వీరేశలింగం పంతు లు, గురజాడ అప్పారావు, సురవరం ప్రతా పరెడ్డి అని కొనియాడారు.    సాహిత్యం మీద మక్కువ, చరిత్ర మీద పట్టుదల కలిసినప్పుడు ఆయన గోల్కొండ కవుల సంచిక అనే అపూర్వ గ్రంథాన్ని వెలువరించారని తెలిపారు. 

ప్రస్తుత కాలంలో పత్రికలు(మీడియా రంగం) రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సత్యాన్ని తక్కువగా, అసత్యాన్ని ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. పత్రిక విలువలు క్షీణిస్తే, ప్రజాస్వామ్యం కూడా క్షీణిస్తుందని ఆయన హెచ్చరించారు.  

కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మొట్టమొదటి సారిగా సురవరం ప్రతాప రెడ్డి1926లో ‘గోలకొండ’ అనే పత్రిక స్థాపించారని గుర్తుచేశారు. తెలుగుకు ఆదరణ లేని రోజుల్లో తెలుగు పత్రికను స్థాపించడం  పెద్ద విప్లవమని కొనియాడారు. తెలుగు వారు అనగానే గుర్తొచ్చే వారిలో సురవరం ప్రతాప రెడ్డి ముందు వరసలో ఉంటారని పేర్కొన్నారు. 

డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ నిజాం రాజుల పరిపాలనలో తెలుగుపై ఉన్న వివక్షతను పక్కనబెట్టి, తెలుగు జాతి సాంస్కృతిని దీవిటిలా వికసింపజేసిన మహానీయుడు సురవరం ప్రతాప రెడ్డి అని అన్నారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రతాప రెడ్డి పురస్కారం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజాం నవాబుల చేతిలో బందియై చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగులోకి నడిపిన మహానుభవుడు సురవరం ప్రతాపరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సురవరం కుటుంబ సభ్యులతో పాటు పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.