తెలంగాణ సుర‘వరం’
తెలంగాణ సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవన తొలి వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఈ ప్రాంతం నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతు న్న రోజుల్లో ౧౮౯౬ మే ౨౮న జన్మించాడు. ఆయన స్వస్థలం అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాలపాడు. నాటి సమాజం తీవ్ర అజ్ఞానంలో ఉంది. తెలుగు భాషకు ఏమాత్రం ఆదరణ లేని కాలం. ఉర్దూ అధికారిక భాషగా చలామణీలో ఉంది. ప్రజలపై నిజాం పాలకుల అణచివేత కొనసాగుతున్నది. అలాంటి చీకటి రోజుల్లో సురవరం ప్రతాపరెడ్డి వెలుగురేఖలా నిలిచాడు.
తన కలం ద్వారా తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపాడు. అందుకే ఆయనకు వైతాళికుడనే పేరు వచ్చింది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ఆయన బలమైన పునాది వేశాడు. నిజాం రాజుల అణచివేతపై సురవరం ప్రతాపరెడ్డి తీవ్రంగా పోరాడా డు. ప్రజలకు సొంత భాషా పత్రిక లేని లోటును గుర్తించాడు. నాటి పరిస్థితుల్లో పత్రిక పెట్టడం చాలా పెద్ద సాహసం. ప్రాణాలకు తెగించి ఆయన 1926 మే 10న ‘గోలకొండ’ పత్రికను స్థాపించాడు. పత్రిక తెలంగాణ సాయుధ పోరాటంలో అద్భుతమైన పాత్ర పోషించింది. పత్రిక ప్రజల గొంతుకగా నిలిచింది.
నైజాం ప్రభుత్వ అక్రమాలు, రజాకార్ల దౌర్జన్యాలను పత్రిక ఎండగట్టింది. బ్రిటీష్ వారితో కలిసి నిజాం ప్రభుత పన్నిన కుట్రలను ప్రజల ముందుకు తెచ్చింది. సామాన్యుల్లో విప్లవ చైతన్యాన్ని రగిలించింది. పత్రిక నడపడం కత్తిమీద సాములా సాగింది. నైజాం ప్రభుత్వం నుంచి సురవరం తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొన్నాడు. పత్రికను ఆపేయడానికి రజాకార్లు అనేక కుట్రలు చేశారు. బ్రిటీష్ రెసిడెంట్ ఒత్తిడితో నిజాం సర్కారు పత్రికపై ఆంక్షలు విధించింది. సంపాదకీయాలు రాసే హక్కును లాగేసుకుంది. అయినా సురవరం లొంగలేదు. సంపాదకీయాల స్థానంలో ఖాళీ జాగాలను వదిలి నిరసన తెలిపాడు. పత్రికలో పని చేసే కాలంలోనే ఎందరో ఉద్యమకారులు ప్రాణభయంతో బతికారు.
షోయబుల్లా ఖాన్ వంటి జర్నలిస్టులు నిజాం ఆగడాలను ఎండగట్టినందుకు దారుణంగా హత్యకు గురయ్యారు. అలాంటి గడ్డు కాలంలో సురవరం ధైర్యంతో పత్రికను నడిపించాడు. గోలకొండ పత్రిక కేవలం వార్తా పత్రికగా మాత్రమే మిగలిపోలేదు. అదొక గొప్ప సాహిత్య వేదికగా మారింది. పత్రికలో ఎందరో ప్రముఖులు వ్యాసాలు రాశారు. వారి రాతలతో తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. సురవరంతో పాటు మాడపాటి హనుమంతరావు, రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు వంటి ప్రముఖులు పత్రికలో వ్యాసాలు రాశారు.
పత్రిక అవసరాలకు ఇతోథికంగా తోడ్పడ్డారు. నాటి సాహితీ దిగ్గజాలు దాశరథి కృష్ణమాచార్య, దేవులపల్లి రామానుజరావు వంటి దిగ్గజాలు పత్రికలో వ్యాసాలు రాశారు. నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ వీరంతా అక్షర శరాలు సంధించారు. జైలు శిక్షలకు సురవరంతో కలిసి నిర్భీతితో పత్రికను నడిపించారు. తెలంగాణ ప్రాంతంపై సురవరానికి ప్రాణసమానమైన ప్రేమ ఉంది. ‘తెలంగాణలో కవులు లేరు’ అని ఆంధ్రా ప్రాంతానికి చెందిన పండితుడు ముదిగొండ మార్కండేయ విమర్శించారు.
ఈ అవమానాన్ని సురవరం భరించలేకపోయా డు. తెలంగాణ ప్రాంతాన్ని జల్లెడ పట్టి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 354 మంది కవుల వివరాల సేకరించాడు. ‘గోలకొండ కవుల సంచిక’ పేరుతో ఒక అద్భుత గ్రంథాన్ని తెచ్చాడు. ఈ ప్రాంత ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు గ్రంథం ఇదే కావడం విశేషం. తెలంగాణ సంస్కృతిని, పండుగలను సురవరం ఎంతో ఇష్టపడ్డాడు.
ఇక్కడి పండుగల విశిష్టతను తెలుపుతూ ఆయన అనేక వ్యాసాలు రాశాడు. బతుకమ్మ పండుగ వెనుక ఉన్న సామాజిక ఐక్యతను అద్భుతంగా వివరించాడు. దసరా, దీపావళి పండుగలను తెలంగాణ ప్రజలు జరుపుకొనే తీరును ఉటంకించాడు. పండుగలు కేవలం వేడుకలు కావని, అవి తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నాడు. ఆయన రాసిన వ్యాసాలు నాటి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. మన పండుగలను మనం గర్వంగా జరుపుకోవాలనే స్పృహ కలిగించాయి.
గోలకొండ పత్రిక కోసం సురవరం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూశాడు. నైజాం సర్కారు ఆయనపై అనేక కేసులు పెట్టింది. ఆస్తులను జప్తు చేసేందుకు ప్రయత్నించింది. అయినా.. ఆయన వెనకడుగు వేయలేదు. నిజాం రాజు ఇచ్చిన పదవులను, ప్రలోభాలను తిరస్కరించాడు. ప్రజల కోసం దారిద్య్రాన్ని అనుభవించాడు. తెలుగు భాషా రక్షణ కోసం నిరంతరం శ్రమించాడు. తెలంగాణ సాహిత్య పత్రికలకు ఆయనొక దిక్సూచి. ఆయన చేసిన త్యాగాలు, అక్షర శ్రమ తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.
శ్రుతి






