22ఏ జాబితాలోని పొరపాట్లను సరిచేస్తాం
కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
పట్టా భూములు నమోదైతే ప్రజలు ఆందోళన చెందొద్దు
అన్ని రికార్డులు పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశం
రంగారెడ్డి, అగస్టు18 (విజయక్రాంతి): 22-A (నిషేధిత భూముల) జాబితాకు సంబంధించిన అంశాలపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పొరపాటున నమోదైన పట్టా భూములను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.
మంగళవారం ఆయన శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, భూ రికార్డుల నిర్వహణ, దరఖాస్తుల పురోగతి మరియు సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదవుతున్న అంశా లపై ఆరా తీశారు. పాత-కొత్త సర్వే నంబర్ల వ్యత్యాసాలు, సరిహద్దుల విభజన, పహాణీలు మరియు కోర్టు తీర్పులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే భూముల స్థితిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ )భూములకు సంబంధించి జీవో 765 ప్రాతిపదికన గతంలో జరిగిన ప్రక్రియలను పరిశీలించి, అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం నిర్ణయం తీసు కుంటారు. భూ రికార్డులను సవరించుకోని వారు సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ, నిషేధిత భూములను మాత్రమే 22-Aలో ఉంచుతామని, నిజమైన (జెన్యూన్) పట్టా భూములకు ఎలాంటి అన్యాయం జరగకుండా రికార్డుల ప్రాతిపదికన సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.






