1 September, 2026 | 4:23 AM

ప్రతి అంగుళం సర్వే

01-09-2026 02:09 AM
  1. రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తాం
  2. ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన భూమి హక్కులు కల్పిస్తాం
  3. గత పాలకుల నిర్లక్ష్యంతోనే భూ సమస్యలు 
  4. కమీషన్లే తప్ప సంక్షేమం అభివృద్ధి పట్టని దొరపాలన 
  5. అబద్ధాలరావు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు 
  6. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మహబూబాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): భవిష్యత్తులో ఎలాంటి భూ తగాదాలకు ఆస్కారం లేకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం(technology) తో రాష్ట్రంలో ప్రతి అంగుళం భూమిని సర్వే చేయిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు. ప్రతి ఒక్కరికీ భూధార్(Bhoodhar) ద్వారా రూపొందించిన క్యూఆర్ కోడ్‌(QR code)తో కూడిన భూమి యాజమాన్యపు హక్కులను కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఇందుకోసం రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రెవెన్యూ డివిజన్(revenue division) పరిధిలో 70 గ్రామాల్లో భూమి సర్వే చేస్తున్నామని, ఇదేవిధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి అంగుళం భూమిని సర్వే చేయిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపలేదన్నారు. కేవలం కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, ధరణి పేరుతో భూ అక్రమాలకు, కబ్జాలకు తెరలేపిందని మంత్రి విమర్శించారు.

ఫలితంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఊర్లకు ఊర్లే భూ రికార్డుల నుంచి తప్పిపోయి ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు లేకుండా ఇంతకాలం ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు సుమారు 800 మంది దాదాపు 1800 పైచిలుకు ఎకరాల భూమిలో ఇలాంటి హక్కులు లేకుండా పదేళ్లపాటు ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు రుణాలకు నోచుకోలేకుండా పోయిందన్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని తెచ్చి, రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి సర్వే నిర్వహించి, రికార్డులు పక్కాగా రూపొందిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి రాకముందు నారాయణపురం సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంకా కొంత భూమికి సంబంధించిన సమస్య ఉందని, దీన్ని కూడా త్వరలో పరిష్కరించి, సాగులో ఉన్న ప్రతి ఒక్కరికీ పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామన్నారు.

సోమవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు దొర పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. తాము ఏ ఒక్క సంక్షేమాన్నీ తగ్గించడం లేదని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. అబద్ధాలరావు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

ముందు మీరు చేసిన అవినీతిపై మీ కుటుంబ సభ్యురాలైన కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని మంత్రి పేర్కొన్నారు. ‘మీ లాగా మాది నియంత పాలన కాదు. మీరు కుటుంబ సభ్యులు ఏది చెప్తే అది మీ పాలనలో నడిచింది. మా ప్రభుత్వంలో సమిష్టి నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను, సమస్యలను ఆకలింపు చేసుకొని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రజాపాలన నిర్వహిస్తు న్నాం’ అని చెప్పారు.

‘మీరు చెబితేనే మేము చేస్తున్నామని అనుకుంటే.. అది మీ భ్రమ. ఎడ్ల బండి కింద శునకం నడుస్తూ తానే బండిని నడిపిస్తున్నా నని భ్రమ పడినట్లు ఉంటుంది’ అని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే రూ.67 వేల కోట్లను వడ్డీ లేని రుణంగా ఇచ్చామన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటుచేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రులు ప్రారం భించారు. అలాగే నూతనంగా నిర్మించే మున్సిపల్ కార్యాలయ నిర్మాణం, జిల్లా పరిధిలో నూతనంగా ఏర్పడ్డ ఇను గుర్తి, సిరోల్, దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ పురం గ్రామ రైతులకు నూతనంగా జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలను అందించారు.