1 September, 2026 | 2:48 AM

రేవంత్ విదేశీ పర్యటనలు ఎవరి కోసం?

01-09-2026 02:11 AM

తెలంగాణ కోసమా? తమ్ముళ్ల వ్యాపారాల కోసమా?

ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీకి కొండల్‌రెడ్డి చైర్మన్ ఎలా అయ్యారు?

బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలు తెలంగాణ కోసం చేస్తున్నారా? లేక తన సోదరుల వ్యాపారాల కోసం చేస్తున్నారా? అని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్(BRS Spokesperson Manne Krishank) ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పర్యటనల ద్వారా తెలంగాణకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంత పెట్టుబడి వాస్తవంగా వచ్చింది? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? అనే వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్, దుబాయ్, దావోస్, అమెరికా, యూకే సహా అనేక దేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారని, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి అంతర్జాతీయ విద్యాసంస్థలను ఫోర్త్ సిటీకి తీసుకొస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు వాస్తవంగా తెలంగాణకు ఏమి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారని, అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన రెడ్లర్ టెక్నాలజీస్- టెసెరాక్ట్ అ డ్వాన్డ్స్ సిస్టమ్స్ మధ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో సీఎం సోదరుడు ఎనుముల కొ ండల్‌రెడ్డి పాత్రపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌చేశారు.

సీఎం ఇజ్రాయెల్ ప్రతినిధులను కలుస్తారు.. ఆ తర్వా త ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి సంబంధిత వ్యక్తులతో సమావేశమవుతారు.. అనంతరం ఒప్పందం జరుగుతుందని, అసలు ఎనుముల కొండల్‌రెడ్డి ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీకి చైర్మన్ ఎలా అయ్యారు? ఆయన ఏ హోదాలో విదేశీ ప్రతినిధులతో సమావేశమయ్యారని ప్రశ్నించారు.

కొండల్‌రెడ్డికి కంపెనీతో సం బంధం లేదని గతంలో మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారని, ఇప్పుడు బయటకు వస్తున్న వివరాలకు ఆయన గత ప్రకటనలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. గత అమెరికా పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్‌కు చెందిన స్వచ్ఛ్ బయో సంస్థ సుమారు రూ.1,000కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్నట్టు వచ్చిన ఆరోపణలపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

మ్యాక్స్ బియన్ ఫార్మా, మెడికవర్ వ్యాపార వ్యవహారాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు కూడా సీఎం ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని గుర్తుచేశారు. సీఎం విదేశీ పర్యటనలు తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకురావ డానికి ఉండాలని, కానీ సీఎం కుటుంబసభ్యులకు సంబంధించిన కంపెనీలకు విదేశీ వ్యాపార అవకాశాలు ఎలా వస్తున్నాయనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్‌తో చేసుకునే ఒప్పందాలను రాహుల్ బహిరంగంగా ఎన్నోసార్లు ప్రశ్నించారని, మరి తెలంగాణ కాంగ్రెస్ సీఎం సొంత త మ్ముడు ఇజ్రాయిల్ డిఫెన్స్ సంస్థలతో ఎలా ఒప్పందాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. సీఎం విదేశీ పర్యటనలు, విదేశీ సంస్థలతో జరిగిన సమావేశాలు, ఒప్పందాలు, కంపెనీలకు భూముల కేటాయింపులు, సీఎం కుటుంబసభ్యులకు సంబంధించి నట్టు వస్తున్న వ్యాపార ఆరోపణలపై కేంద్రప్రభుత్వం సమగ్ర, స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌చేశారు. ఈ అంశాలను అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తుతారని హెచ్చరించారు.