19 August, 2026 | 3:55 AM

నారాయణగూడలో సర్వేయర్ల ఆందోళన

19-08-2026 12:00 AM

సర్వే భవన్ ముట్టడికి యత్నం

అడ్డుకుని, పలువురిని అరెస్టు చేసిన పోలీసులు

సమస్యలు పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

ముషీరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): రాష్ట్రంలోని లైసెన్స్‌స్డ్ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణగూడలోని సర్వే భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.

సర్వే భవన్‌ను ముట్టడించేందుకు సర్వేయర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు సర్వేయర్లను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్టు చేయడం సరికాదని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి శేఖర్ లు తీవ్రంగా  ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరెస్టు చేసిన సర్వేయర్లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,500 మంది సర్వేయర్లు పనిచేస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత, నెలవారీ గౌరవ వేతనం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో రద్దు చేసిన లైసెన్సులను పునరుద్ధరించాలని, వర్క్ మెమో, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని, సర్వేయర్లకు ఆరోగ్య భద్రతతో పాటు రూ.కోటి జీవిత బీమా కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదాలకు గురయ్యే సర్వేయర్లకు తక్షణ వైద్య, ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి జిల్లాకు చెందిన సర్వేయర్ కోలా విఠల్ ఇటీవల పాముకాటుకు గురై చికిత్స పొందుతున్నందున ఆయనకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలపై చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ నాయకులు గోవర్ధన్, సందీప్, బాలకృష్ణ, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.