28 July, 2026 | 12:31 AM

పంట మార్పిడితోనే భవిష్యత్తు తరాలకు మనుగడ

28-07-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్, జులై 27 (విజయక్రాంతి): పంట మార్పిడి విధానంతో భూసారాన్ని పెంపొందించడంతోపాటు భవిష్యత్ తరాల మనుగడకు ఇబ్బంది లేకుండా చూడవచ్చని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణం ఏటిగడ్డ తండ రైతు వేదికలో విత్తనమేళ ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తో కలిసి జిల్లాలో ప్రాజెక్టు వైవిద్యం కార్యక్రమాన్ని ప్రారంభించి వివిధ కంపెనీల ప్రతినిధులు ఏర్పాటు చేసిన విత్తనాల స్టాల్స్ ను సందర్శించారు.

రైతులతో స్వయంగా మాట్లాడి ప్రత్యామ్నాయ ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలను (సీడ్స్) ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ సూపర్ ఎల్ నినో ప్రభావం వలన ప్రస్తుత వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఎస్సారెస్పీ, ఇతర నీటి వనరులు కూడా అందుబాటులో లేనందున రైతులు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుందని, ఇట్టి విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పంట మార్పిడి వైపు అడుగులు వేసి ఆరుతడి పంటలు, కూరగాయల పంటలు సాగు చేస్తే రైతులకు అధిక దిగుబడి లాభాలు కూడా వస్తాయని కోరారు,

ప్రతి రైతు తనకు ఉన్న భూమిలో సాధ్యమైనంత వరకు నీటి కుంట (పంట కుంట)ను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా నీటి వనరులు అందుబాటులో ఉంటాయని సూచించారు. ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం సూచించిన ప్రకారం వ్యవసాయ శాఖ అధికారుల నుండి సమాచారం సేకరించి కూరగాయలు,ఆకుకూరలు, ఆరుతడి పంటలు,సాగు చేయాలని కోరారు.

అధికంగా వరి పండించడం వలన, అధిక యూరియా వాడకం, కాన్సర్ రావడం, భూసారం కోల్పోవడం, అవసరం కంటే ఎక్కువ మిల్లుల ఏర్పాటు, బీహార్, చత్తీస్గడ్ నుండి హమాలీలను రప్పించుకోవాల్సిన అవసరాలు, రవాణా, నిలువ చేసే గోడౌన్ ల విషయాలలో పలు సమస్యలు ఎదుర్కుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, స్థానిక సర్పంచులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.