18 June, 2026 | 11:16 AM

ఇల్లందు ఏరియా మనుగడను కాపాడాలి: బీఎంఎస్-ఎస్సీసీఎంకేఎస్

18-06-2026 10:38 AM

ఇల్లందు, (విజయక్రాంతి): ఇల్లందు జేకే-5 ఓసీ విస్తరణలో భాగమైన పూసపల్లి మైన్ పనులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేసి ఓసీని ప్రారంభించి కార్మికుల ఆందోళనలు, అనుమానాలకు తెరదించాలని బొగ్గు పుట్టినిల్లు అయిన ఇల్లందు ఏరియా మనుగడను కాపాడాలని బీఎంఎస్-ఎస్సీసీఎంకేఎస్ నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కేఓసీ-2 క్యాంటీన్‌లో ఉదయం టిఫిన్‌తో పాటు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయాలని, కార్మికులకు ప్లే డేలు పెంచాలని కోరారు.

ఏరియా వర్క్‌షాప్‌లోని ఎలక్ట్రికల్ సెక్షన్ పైకప్పు శిథిలావస్థలో ఉండటంతో వర్షాకాలంలో విలువైన సామగ్రి, యంత్రాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ నెలలో ఎన్నికల విధులకు వెళ్లిన సెక్యూరిటీ సిబ్బందికి ఇప్పటివరకు టీఏ, డీఏ బిల్లులు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిని వెంటనే విడుదల చేయాలని అన్నారు.

హెచ్‌బీఎల్‌ఆర్‌ఎస్ హౌసింగ్ బిల్డింగ్ లోన్ రీయింబర్స్‌మెంట్ పథకంలో అర్హులైన కార్మికులకు రూ.50 వేల వడ్డీ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో గెలిచిన అధికార సంఘం, ప్రాతినిధ్య సంఘాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు నాయని సైదులు, పిట్ సెక్రటరీ పి. శ్రీనివాస్, కోయగూడెం అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ప్రదీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. రాజశేఖర్, ఆఫీస్ ఇన్‌చార్జి రాము తదితరులు పాల్గొన్నారు.