18 June, 2026 | 10:39 AM

ఉద్యోగులను వాడుకుంటున్న ప్రభుత్వాలు

18-06-2026 09:41 AM
  1. సమస్యల పరిష్కారంలో  నిర్లక్ష్యం
  2. సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులే కీలక భూమిక
  3. పెండింగ్ డీఏలు చెల్లించి ఈహెచ్‌ఎస్‌ను వెంటనే అమలు చేయాలి
  4. ఉద్యోగుల హక్కుల కోసం సంఘటిత పోరాటమే మార్గం
  5. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్

గజ్వేల్, (విజయక్రాంతి): ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నప్పటికీ, వారి సమస్యల పరిష్కారంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ మండిపడ్డారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. గజ్వేల్ నియోజకవర్గ టీఎన్జీవో శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నారని, కానీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వచ్చినప్పుడు ప్రభుత్వాలు చొరవ చూపడం లేదని విమర్శించారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న పదోన్నతులు, బదిలీలు, పెండింగ్ బిల్లులు, సేవా నిబంధనలకు సంబంధించిన సమస్యలు, ఇతర పరిపాలనా ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ను పూర్తిస్థాయిలో అమలు చేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో అన్ని స్థాయిల్లో నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

అయితే ఉద్యోగులంతా ఐక్యంగా, సంఘటితంగా ఉంటేనే హక్కుల సాధన సులభమవుతుందన్నారు. అనంతరం సభ్యులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. సంఘం భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు, సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం గజ్వేల్ డివిజన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు  రాజశేఖర్ రెడ్డి, లింగం, ప్రవీణ్, భరత్, శివప్రసాద్, సలాహుద్దీన్, నరేష్ చారి, జయకృష్ణ, బాను కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘం బలోపేతానికి పూర్తి సహకారం అందించాలని నాయకులు కోరారు.