వేములవాడలో గంజాయి సాగు గుట్టురట్టు - నిందితుడు అరెస్ట్
వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారం గ్రామ శివారులో గంజాయి మొక్కలను అక్రమంగా సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అచ్చే లాల్ అనే వ్యక్తి గంజాయి సాగు చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అక్కడ సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తదనంతరం కేసు నమోదు చేసి, ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, గంజాయి మొక్కలను స్వాధీనం చేసిన ఎస్సై శ్రీనివాస్, పిసి మహిపాల్, పిసి సంతోష్, హోంగార్డ్ ఆనంద్‌లను అభినందించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం లేదా వినియోగం వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉన్నవారు స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందజేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.




