19 August, 2026 | 9:05 PM

బొక్కస్ గావ్ సహకార సంఘం కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు

19-08-2026 07:30 PM

12 లక్షల నిధుల మళ్లింపు, 11 లక్షల చెక్కుల బౌన్స్ 

సొసైటీ సొమ్ము వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ 

బొక్కస్‌గావ్ PACSలో  భారీ అక్రమాలు

జిల్లా సహకార అధికారి చర్యలు

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పరిధిలోని బొక్కస్ గావ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)లో అడ్డగోలుగా సాగిన ఆర్థిక అక్రమాలు, నిధుల దుర్వినియోగం కలకలం రేపుతున్నాయి. నియమ నిబంధనలను తుంగలో తొక్కి సొసైటీ నిధులను పక్కదారి పట్టించిన బొక్కస్‌గావ్ PACS కార్యదర్శి ఎం.సతీష్‌ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు తెలంగాణ సహకార సంఘాల చట్టం-1964 లోని సెక్షన్ 59 కింద శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు సతీష్‌ ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా జాయింట్ రిజిస్ట్రార్ / జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

12 లక్షలు గోల్‌మాల్. అధికారుల కథనం ప్రకారం... బొక్కస్‌ గావ్ సొసైటీలో పెట్రోల్ బంక్ ప్రాజెక్ట్ ఏర్పాటు పేరుతో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు, ఒప్పందాలు లేకుండా విజయవాడకు చెందిన మెస్సర్స్ దివ్య ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు రూ" 12 లక్షల నిధులను కార్యదర్శి అనధికారికంగా మళ్లించారు. దీనిపై తీవ్ర ఆర్థిక నిర్లక్ష్యం వహించడమే కాకుండా, సదరు సంస్థ ఇచ్చిన 11 లక్షల రూ" విలువైన చెక్కులు సైతం బౌన్స్ అయ్యాయి. దీనికి తోడు సొసైటీకి చెందిన 6.30 లక్షల నిధులను నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శి తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకొని లావాదేవీలు నడిపినట్లు విచారణలో తేలింది.

నకిలీ వోచర్లు...దారి మళ్లిన నిధులు 2020-21 సంవత్సరంలో సూత్లి, దారం సరఫరా కోసం కేటాయించిన 1.50 లక్షల వ్యయాన్ని కూడా దుర్వినియోగం చేసి, దానికి సంబంధించిన లెక్కలు చూపడంలో కార్యదర్శి పూర్తిగా విఫలమయ్యారు. సరఫరాదారుల వోచర్లలో పేర్లు తారుమారు చేయడం (గురు బసవేశ్వర వర్సెస్ శ్రీ బాలాజీ కిరాణా), చెల్లుబాటయ్యే GST ఇన్‌ వాయిస్‌లు లేకపోవడం, నగదు గ్రహీత రసీదులు సరిగా లేకపోవడం వంటి భారీ అక్రమాలకు పాల్పడ్డారు. చివరికి ఒకే వోచర్‌ పై వేర్వేరు తేదీల్లో క్లెయిమ్‌లు సృష్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిధులు మళ్లించిన సంస్థకు కనీసం కార్యాలయ అడ్రస్ కూడా లేకపోవడం గమనార్హం. కఠిన ఆంక్షలు...తనిఖీలు ముమ్మరం...

ఈ వ్యవహారం పై నారాయణఖేడ్ డివిజన్ సబ్-కలెక్టర్ (సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్) ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. దీనిపై గతంలో ఇచ్చిన షో-కాజ్ నోటీసుకు కార్యదర్శి సతీష్ ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ కాలంలో ఆయనపై కఠిన ఆంక్షలు విధించారు. ఉన్నతాధికారుల వ్రాతపూర్వక అనుమతి లేకుండా సొసైటీ ప్రాంగణంలోకి అడుగుపెట్టరాదని, రోజువారీ పరిపాలనలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. రికార్డులు, ఆన్‌లైన్ పోర్టల్‌లను ముట్టుకోవద్దని, పూర్తి బాధ్యతలను వెంటనే మరొకరికి అప్పగించాలని ఆదేశించారు. గల్లంతైన నిధులు, చెల్లని చెక్కుల రికవరీ కోసం శాఖాపరమైన చట్టబద్ధ విచారణను మరింత వేగవంతం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.